
AP News: పెళ్లి చేసుకోమంటూ వేధించిన హిజ్రా.. హతమార్చిన యువకుడు
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్టుడే: తనకు ఇష్టం లేదని చెబుతున్నా..పెళ్లి చేసుకోమంటూ వెంటపడి వేధిస్తున్న హిజ్రాను యువకుడు హతమార్చిన ఘటన గుంటూరు నెహ్రూనగర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నెహ్రూనగర్ చివర వెంకటాద్రిపేటకు చెందిన ధూపాటి క్లైమంత్ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన హిజ్రా చందన (35)కు మూడేళ్ల క్రితం అతనితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత నుంచి పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతో ఏడాది కిందట హైదరాబాద్కు మకాం మార్చాడు. ఈ నెల 16న అతని మేనమామ మృతి చెందడంతో గుంటూరు వచ్చాడు. సోమవారం అర్ధరాత్రి క్లైమంత్ను కలిసిన చందన పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుపట్టడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు పెళ్లి ఇష్టం లేదని అతను ఎంత చెబుతున్నా వినకుండా వేధించడంతో విసిగిపోయాడు. అక్కడే ఉన్న రోకలిబండతో హిజ్రా తలపై కొట్టి హతమార్చాడు. విషయం తెలుసుకున్న కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘటానా స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.