Updated : 02 Jan 2022 05:56 IST

Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో 17 మంది బలి

వారం రోజుల క్రితం పెళ్లయిన ఇంట పెనువిషాదం చోటు చేసుకుంది. ఇటీవలే ఎస్సైగా నియమితుడైన పెళ్లి కుమారుడితోపాటు ఆయన తండ్రిని ప్రమాదం కబళించింది. ఇంటిపట్టున ఉన్న ఇద్దరు మహిళలపై బూడిద ట్యాంకరు దూసుకెళ్లి వారి జీవితాలను బుగ్గిచేసింది. మరో చోట ఓ చిరు వ్యాపారి కుటుంబాన్ని కారు చిదిమేసింది. సంబరంగా నూతన సంవత్సర వేడుకలు చేసుకున్న ఇద్దరు యువకులను ఓ కారు పొట్టన పెట్టుకుంది. కొత్త సంవత్సరం తొలిరోజు అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రాష్ట్రంలో శనివారం పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. వీరిలో 10 మంది నాలుగు ప్రమాదాల్లోనే కన్నుమూశారు. హైదరాబాద్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో జరిగిన ఇతర ప్రమాదాల్లో మరో ఏడుగురు అసువులు బాశారు. అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యం వీటికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రమాదాల వివరాలివీ..


ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టిన కారు

నలుగురి మృత్యువాత

బోల్తాపడ్డ కారు , పక్కనే బాలరాజు మృతదేహం

జహీరాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం డిడ్గి వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. బీదర్‌ వైపు వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఎనిమిది నెలల చిన్నారి సహా దంపతులు, కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందారు. జహీరాబాద్‌ సీఐ రాజశేఖర్‌, గ్రామీణ ఎస్‌ఐ రవిగౌడ్‌ కథనం ప్రకారం...అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందిన భార్యాభర్తలు మోతే బాలరాజు (28) భార్య శ్రావణి (23) కూతురు అమ్ములు (8 నెలలు)తో కలిసి కొన్నాళ్లుగా జహీరాబాద్‌ ప్రాంతంలో నివాసం ఉంటూ దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి బీదర్‌ వైపు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి వీరివాహనాన్ని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న బాలరాజు, ఆయన భార్య శ్రావణి, కూతురు అమ్ములుతోపాటు కారులో ప్రయాణిస్తున్న వికారాబాద్‌ జిల్లా మర్పపల్లి మండలం పట్లూర్‌ గ్రామానికి చెందిన, సీసీ కెమెరాల మరమ్మతులు చేసే మహ్మద్‌ ఫరీద్‌(24) మరణించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే క్రమంలో ద్విచక్ర వాహనాన్ని కారు అతివేగంగా ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడి బాలరాజు మృత్యువాతపడ్డారు. ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. శ్రావణి, అమ్ములు ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఫరీద్‌ను హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలాడు.

`

బాలరాజు, ఫరీద్‌


వేడుకలు చేసుకుని వెళ్తుండగా ప్రమాదం

ఇద్దరి మృతి

ఉదయ్‌, మహేశ్‌కుమార్‌

వెల్దండ గ్రామీణం, బల్మూరు-న్యూస్‌టుడే: నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని ఇంటికి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ శివారులో శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బల్మూరు మండలంలోని పొలిశెట్టిపల్లితండాకు చెందిన రమావత్‌ ఉదయ్‌ (14), ముడావత్‌ మహేశ్‌కుమార్‌ (19), రమావత్‌ అరుణ్‌కుమార్‌ కలిసి శుక్రవారం కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు హైదరాబాద్‌ లో ఉంటున్న అరుణ్‌కుమార్‌ బాబాయ్‌ ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. శనివారం వారు తిరిగి వస్తుండగా..హైదరాబాదులోని వసస్థలిపురానికి చెందిన రత్నాకర్‌ రామకృష్ణ రాజు కారు ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రుల్లో రమావత్‌ ఉదయ్‌, మహేశ్‌కుమార్‌ చనిపోయారు. అరుణ్‌కుమార్‌ చికిత్స పొందుతున్నాడు. ఉదయ్‌ బల్మూరు 8వ తరగతి చదువుతుండగా, మహేశ్‌ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.


ఇళ్లపైకి దూసుకెళ్లిన బూడిద ట్యాంకర్‌

కోటేశ్వరమ్మ, వెంకటనర్సమ్మ

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇళ్లపైకి బూడిద ట్యాంకరు దూసుకెళ్లి ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు. పట్టణంలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నుంచి బూడిద లోడుతో బయల్దేరిన ఓ ట్యాంకరు శనివారం మధ్యాహ్నం అంబేడ్కర్‌ కూడలి వద్ద ఆటోను ఢీకొంది. అక్కడున్న ఆటోడ్రైవర్లు వాహనాన్ని వెంబడించారు. వారిని తప్పించుకునే ప్రయత్నంలో ట్యాంకరు డ్రైవరు రెండిళ్లపైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో శీలం కోటేశ్వరమ్మ (50), గార్లపాటి వెంకటనర్సమ్మ (55)లు మృతిచెందారు.


వారం క్రితమే పెళ్లి.. అంతలోనే పెను విషాదం

పెళ్లిలో కుటుంబ సభ్యులతో శ్రీనునాయక్‌, మాన్యానాయక్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: ఆయన ఇటీవలే ఎస్సైగా విధుల్లో చేరారు. వారం క్రితమే వివాహమూ జరిగింది. అంతలోనే ఊహించని రీతిలో ఓ రోడ్డు ప్రమాదం ఆయనతో పాటు తండ్రినీ కబళించింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో తండ్రీకుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారిపై నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లిరాంనగర్‌ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యనాయక్‌తండాకు చెందిన  మాన్యానాయక్‌ (55), దస్లీ దంపతుల పెద్ద కుమారుడు నేనావత్‌ శ్రీనునాయక్‌ (30) రెండు నెలల క్రితం వికారాబాద్‌లోని వన్‌టౌన్‌లో క్రైం ఎస్సైగా విధుల్లో చేరారు. మాన్యనాయక్‌ సొంత ఆటో నడుపుతుంటారు. శ్రీనునాయక్‌కు చింతపల్లి మండలంలోని ఓ తండాకు చెందిన అమ్మాయితో గత నెల 26న  వివాహం జరిగింది. శనివారం మాన్యనాయక్‌తండా ఇంటి వద్ద ఒడిబియ్యం తీసుకున్న అనంతరం పెళ్లి కుమార్తె, శ్రీనునాయక్‌ తల్లి దస్లీతో పాటు దగ్గరి బôధువులు కలిసి రెండు కార్లలో ఇంజపూర్‌కు బయలుదేరారు. వారందరినీ పంపించిన అనంతరం ఆటోలో శ్రీనునాయక్‌, తండ్రి మాన్యనాయక్‌ బయలుదేరారు. అయితే తండ్రి కొంత మద్యం తాగినట్లు గమనించిన శ్రీనునాయక్‌.. తానే ఆటో నడుపుతూ ఇంజపూర్‌కు బయలుదేరారు. పోలేపల్లిరాంనగర్‌ గేట్‌ సమీపంలోకి ఆటో చేరుకోగానే హైదరాబాద్‌ వైపు నుంచి దేవరకొండకు వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.


యువకుడిని 4 కిలోమీటర్లు లాక్కెళ్లిన లారీ

కోస్గి గ్రామీణం, న్యూస్‌టుడే:.నారాయణపేట జిల్లా కోస్గిలో ఉంటున్న బిజ్జారపు వెంకటయ్య (33) శుక్రవారం రాత్రి సంపల్లిలో స్నేహితులతో కలిసి విందు చేసుకొన్నారు. రాత్రి 11.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మహబుబ్‌నగర్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ కొత్త చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్‌ అబ్దుల్‌ రజాక్‌ లారీని ఆపకుండా దానికింద పడిన ద్విచక్ర వాహనంతోపాటు యువకుడిని సుమారు 4 కిలోమీటర్ల దూరం కోస్గి పట్టణం శివాజీ కూడలి వరకు ఈడ్చుకెళ్లాడు. తర్వాత పారిపోయి ఓ చెట్టెక్కి కూర్చోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని