Updated : 14 Dec 2021 15:17 IST

JK: పోలీసుల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరి మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీనగర్‌ శివారులో పోలీసుల బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 14మంది పోలీసులు గాయపడగా.. వారిలో చికిత్సపొందుతూ ఒక ఏఎస్సై, సెలెక్షన్‌ గ్రేడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందినట్టు కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. పాంతాచౌక్‌ వద్ద జెవాన్‌ ప్రాంతంలోని పోలీస్‌ క్యాంపు సమీపంలోనే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ సాయంత్రం సాయుధ పోలీస్‌ బెటాలియన్‌ బస్సుపై ఉగ్రవాదులు భీకర కాల్పులకు తెగబడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు పాంతా చౌక్‌లోని జెవాన్‌ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ఖండించిన మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా..

శ్రీనగర్‌ శివారులో పోలీస్‌ బస్సుపై ఉగ్రవాదుల కాల్పుల ఘటనను కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

మృతులకు రాహుల్‌ సంతాపం
శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన పోలీసులకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సుందర లోయలో శాంతి నెలకొనాలని, ఉగ్ర దాడులు అంతం కావాలని యావత్‌ దేశం కోరుకుటోందంటూ హిందీలో ట్వీట్‌ చేశారు. 

మమత దిగ్భ్రాంతి

ఉగ్రదాడి ఘటనపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. దేశం ఎప్పటికీ మిమ్మల్ని మరువదంటూ దీదీ ట్వీట్‌ చేశారు. 

ఉగ్రవాదుల పన్నాగాలు దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవు: కాంగ్రెస్‌
శ్రీనగర్‌లో పోలీసుల బస్సుపై ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ‘‘శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన వీర జవాన్లకు వందనాలు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదుల పన్నాగాలు భారతదేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేవు.. జైజవాన్‌..!!’’ అని ట్విటర్‌లో పేర్కొంది.



Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని