Delhi: కారు కింద మృతదేహం.. గంటన్నర పాటు యూటర్నులు కొడుతూ..!

ఆదివారం దిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశ ప్రజలను షాక్‌కు గురిచేసింది. దీనిపై ప్రత్యక్ష సాక్షి మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. 

Updated : 02 Jan 2023 11:46 IST

దిల్లీ: నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న దారుణ ఘటనలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ యువతిని కారు ఢీకొంది. అక్కడితో ఆగకుండా ఆమె శరీరాన్ని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. దాంతో మృతురాలి శరీరం ఛిద్రమైంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ప్రత్యక్ష సాక్షి వెల్లడించి కథనం ప్రకారం..

‘ఆదివారం తెల్లవారుజామున నేను దుకాణం వద్ద ఉన్నాను. అప్పుడు సమయం 3.20 గంటలు. 100 మీటర్ల దూరంలో ఒక వాహనం వద్ద చప్పుడు విన్నాను. టైర్ పేలిందనుకున్నా. కానీ, ఒక కారు మహిళ శరీరాన్ని ఈడ్చుకుపోవడం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. 3.30 గంటల సమయంలో కారు యూటర్న్ తీసుకుంది. అప్పటికీ మృతదేహం కారు చక్రాల వద్ద చిక్కుకునే ఉంది. కారులో ఉన్న వ్యక్తులు పలుమార్లు యూటర్న్‌లు తీసుకున్నారు. వారిని ఆపేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీలుకాలేదు. గంటన్నరపాటు.. దాదాపు 20 కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత కంజావాలా రోడ్డులో జ్యోతి గ్రామం వద్ద మృతదేహం కిందపడింది. అది కేవలం ప్రమాదం మాత్రమే కాకపోవచ్చు’ అని ప్రత్యక్షసాక్షి దీపక్‌ దహియా మీడియాకు వెల్లడించారు. 

ఈ ఘటనపై దిల్లీ పోలీసు ఉన్నతాధికారి హరేంద్ర కుమార్ సింగ్ స్పందించారు. కారు విండోలు మూసి ఉండడం, మ్యూజిక్ శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని గుర్తించలేదని నిందితులు చెప్పారన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే వారు పారిపోయినట్లు తెలిపారు.  

ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌ వచ్చింది. రోహిణిలోని కంజావాలా నుంచి కుతూబ్‌గఢ్‌ వైపు వెళ్తోన్న ఓ కారు.. మహిళను ఈడ్చుకెళ్తున్నట్లు సమాచారం అందింది. కారు నంబరు కూడా చెప్పడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. మార్గమధ్యలో ఉన్న చెక్‌పోస్టులను అలర్ట్‌ చేశారు. అంతలోనే రోడ్డుపై ఓ మహిళ మృతదేహం పడిఉందంటూ కొద్దిసేపటికి కంజావాలా పోలీసులకు మరో కాల్‌ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ బృందం.. ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించింది. కారు నంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించిన పోలీసులు.. అందులో ప్రయాణించిన ఐదుగురిని అరెస్టు చేశారు. 

ఈ ఘటన సిగ్గుచేటు..

‘ఈ ఘటన గురించి విని నాకు తలకొట్టేసినట్లైంది. నిందితుల భయంకరమైన ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై పోలీసులతో సంప్రదింపులు జరిపాను. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’ అని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ట్వీట్ చేశారు. ‘ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. దోషులను కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాను’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని