Kakinada: కాకినాడ కోర్టులో కలకలం.. రక్తమోడుతూ న్యాయమూర్తి ఎదుట ప్రత్యక్షమైన యువకుడు

ఒళ్లంతా రక్తం కారుతున్న ఓ యువకుడు బుధవారం ఉదయం కాకినాడ న్యాయస్థానం ప్రాంగణంలో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. కాకినాడ నగరంలోని రేచర్లపేటకు చెందిన కుంచే ప్రభుతేజకు ఇంటి విషయంలో స్థానికులతో వివాదం నడుస్తోంది.

Updated : 11 Jul 2024 06:56 IST

వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు దాడిచేశారని ఆరోపణ

కోర్టు ప్రాంగణంలో రక్తంతో తడిసిన దుస్తుల్లో ప్రభుతేజ, రోదిస్తున్న అతడి తల్లి

మసీదుసెంటర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: ఒళ్లంతా రక్తం కారుతున్న ఓ యువకుడు బుధవారం ఉదయం కాకినాడ న్యాయస్థానం ప్రాంగణంలో ప్రత్యక్షమైన ఘటన కలకలం రేపింది. కాకినాడ నగరంలోని రేచర్లపేటకు చెందిన కుంచే ప్రభుతేజకు ఇంటి విషయంలో స్థానికులతో వివాదం నడుస్తోంది. దీనిపై కోర్టులో కేసులు ఉన్నాయి. బుధవారం స్థానిక రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కోర్టు వద్దకు తలకు గాయం, రక్తంతో తడిచిన తెల్లటి చొక్కాతో ప్రభుతేజ చేరుకున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతడిని పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ ప్రభుతేజ విలేకరులతో మాట్లాడుతూ.. తాను పిఠాపురంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పనిచేస్తున్నానని..జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు అభిమానినని పేర్కొన్నాడు. తన నివాసానికి సమీపంలో ఉండే వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు బత్తిన రాజు, అతని కుటుంబానికి చెందిన అయిదుగురు కలిసి తన ఇంటి స్థలం ఇచ్చేయాలని కత్తులతో దాడిచేసి గాయపరిచారన్నారు. ఆ కేసులో బుధవారం వాయిదాకు వెళ్లేందుకు తాను బయలుదేరుతుండగా బత్తిన రాజు, పుర్రే శ్రీను, సాగర్, విక్కీ అడ్డుకుని దుర్భాషలాడారన్నారు. భవాని, దేవి తనపై కారం చల్లిన తర్వాత వారంతా కలిసి కత్తులతో దాడి చేశారని చెప్పాడు.

ఎవరూ గాయపరచలేదు: సీఐ

ఈ ఘటనపై కాకినాడ రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో బుధవారం సీఐ నాగేశ్వర్‌నాయక్‌ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుతేజను ఎవరూ గాయపరచలేదని, అక్కడ ఎటువంటి గొడవ జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రభుతేజ ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడని, ఆ ఫుటేజ్‌ అడగగా అవి పనిచేయడం లేదని చెప్పాడన్నారు.. అతడు 2021లో తనకు తాను గాయాలు చేసుకుని ఆసుపత్రిలో చేరగా అప్పటి పోలీసులు తప్పుడు కేసుగా తేల్చారన్నారు. కలెక్టరేట్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అతడికి గాయాలు ఎలా అయ్యాయో పూర్తి విచారణ చేసి తెలుసుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని