Telangana News: మహిళా రోగితో అసభ్య ప్రవర్తన.. వైద్యుడికి పదేళ్ల జైలుశిక్ష

వైద్యం కోసం వచ్చిన రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు నమోదు

Updated : 10 Aug 2022 22:49 IST

హైదరాబాద్‌: వైద్యం కోసం వచ్చిన రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ప్రకారం... శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని భాస్కర్‌ చెస్ట్‌ క్లినిక్‌కు వెళ్లింది. శ్వాసకోశ నిపుణులు విజయ్‌భాస్కర్‌ వైద్యం పేరుతో మహిళ ఛాతిపై చేతులతో తడిమి, ఆ తర్వాత ఆమె రహస్య భాగాలను తాకి ఇబ్బందికి గురిచేశాడు. అనుమానం వచ్చిన బాధితురాలు ప్రశ్నించగా.. చికిత్సలో భాగంగానే అలా చేసినట్టు వైద్యుడు విజయ్‌భాస్కర్‌ తెలిపారు.

2016 సెప్టెంబరు 24న అదే క్లినిక్‌కు వెళ్లిన బాధితురాలితో మరోసారి అదే తరహాలో వ్యవహరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పలేక బాధితురాలు ఇబ్బంది పడింది. 2016 అక్టోబర్ 7న మరోసారి వెళ్లిన బాధితురాలికి అక్కడ ఓ యువతి విజయ్ భాస్కర్‌తో గొడవపడం గమనించింది. కారణం.. ఆరా తీస్తే యువతితోనూ సదరు వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. వైద్యుడి ప్రవర్తనలోనే తేడా ఉన్నట్లు గమనించిన బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. 2016 అక్టోబర్ 8న బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డాక్టర్ విజయ్ భాస్కర్‌ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై బయటికి వచ్చాడు. గోపాలపురం పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయస్థానం విజయ్ భాస్కర్‌ను  దోషిగా తేల్చింది. పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. 2016లోనే గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో విజయ్ భాస్కర్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో నాంపల్లి కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత యువతి హైకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఆ కేసు కూడా విచారణలో ఉందని గోపాలపురం పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని