The Kashmir Files: అమిత్‌ షాను కలిసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినీ బృందం

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించే చర్చ. 1990ల్లో కశ్మీరీ హిందువులపై జరిగిన నరమేధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన......

Published : 16 Mar 2022 21:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సినిమా గురించే చర్చ. 1990ల్లో కశ్మీరీ పండిట్‌లపై జరిగిన నరమేధాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా రూపొంది భారీ కలెక్షన్లు రాబడుతోంది. కాగా ఈ చిత్ర బృందం తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం అల్పాహారానికి తమ చిత్ర బృందాన్ని అమిత్‌ షా ఆహ్వానించినట్లు సినిమాలో కీలక పాత్ర పోషించిన అనుపమ్‌ ఖేర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. హోంమంత్రితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.

ది కశ్మీర్‌ ఫైల్స్‌ దర్శకుడు వికేవ్‌ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, అనుపమ్‌ ఖేర్‌, మరో ముఖ్య పాత్ర పోషించిన పల్లవి జోషి.. అమిత్‌ షాను కలిశారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు చేయడంలో ముఖ్య పాత్ర పోషించి, ఎంతో మందికి విముక్తి కలిగించిన హోంమంత్రి అమిత్‌షా గారికి ధన్యవాదాలు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ బృందాన్ని బ్రేక్‌ఫాస్ట్‌కు మీ ఇంటికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. దేశ భద్రత, అభివృద్ధి పట్ల మీరు చూపించే అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం’ అంటూ అనుపమ్‌ ఖేర్‌ పేర్కొన్నారు.

వివేక్‌ అగ్నిహోత్రి సైతం అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మీ ఈ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేత నిర్ణయం తీసుకొని ప్రజల హృదయాలను దగ్గరచేసే ప్రక్రియను ప్రారంభించారు. కశ్మీర్‌ ప్రజల భద్రత, వారి మానవ హక్కుల కోసం మీరు చేస్తున్న స్థిరమైన కృషి అభినందనీయం. శాంతియుత, సంపన్న కశ్మీర్ కోసం మీ సంకల్పం హర్షణీయం’ అంటూ ట్వీట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని