Shraddha Murder: హత్య తర్వాత ఆఫ్తాబ్‌ ఇంటికి యువతి.. ఆమె ఓ సైకాలజిస్ట్‌ అట..!

శ్రద్ధా హత్య కేసు విచారణలో భాగంగా  పోలీసులు అడిగే ప్రశ్నలను ఆఫ్తాబ్ ముందే ఊహించి ప్రాక్టీస్‌ చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. విచారణలో భాగంగా వారు పలు విషయాలు గుర్తిస్తున్నారు. 

Updated : 21 Jan 2023 15:59 IST

దిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నిందితుడు ఆఫ్తాబ్‌ ఓ పక్క ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతిని పలు మార్లు తన అపార్ట్‌మెంట్‌కు పిలిచినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇంటికి వచ్చిన యువతి ఒక డాక్టర్ అని,  సైకాలజిస్ట్‌ అని పోలీసులు గుర్తించారు. శ్రద్ధాతో పరిచయం ఏర్పడిన డేటింగ్ యాప్‌ ద్వారానే ఆమె కూడా కలిసింది. దర్యాప్తులో భాగంగా ఆ డేటింగ్ యాప్ నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు. అంతేకాదు దానిని వాడి పలువురు మహిళలను కూడా అతడు కలిసినట్లు తెలుస్తోంది.

ఆ ప్రశ్నలు ముందే ప్రాక్టీస్‌ చేశాడా..?

హత్య కేసు విచారణలో భాగంగా  పోలీసులు అడిగే ప్రశ్నలను ఆఫ్తాబ్‌ ముందే ఊహించగలిగాడా..? వాటికి ఎలా సమాధానం ఇవ్వాలో ముందుగానే ప్రాక్టీస్‌ చేశాడా..? అతడికి పాలిగ్రాఫ్ పరీక్ష చేసిన అధికారులకు ఇలాంటి అనుమానాలే తలెత్తినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రశ్నలకు ఎంతో నిబ్బరంగా అబద్ధాలు చెప్పినట్లు పేర్కొన్నాయి. విచారణాధికారి ఒకరు దృశ్యం సినిమా చూశారా? అని ప్రశ్నించగా.. అతడు ఒక చిరునవ్వు నవ్వాడని ఓ వార్తాసంస్థ కథనం పేర్కొంది. ‘పాలిగ్రాఫ్ పరీక్షలో భాగంగా రీడింగ్‌లకు అంతరాయం కలిగించేలా వ్యవహరించాడు. ఎలక్ట్రోడ్‌లను అతడి శరీరానికి పెట్టగానే దగ్గడం ప్రారంభించాడు. దగ్గువల్ల రీడింగ్‌లో అంతరాయం ఏర్పడేది. దాంతో అతడు చెప్పేది నిజమా..? లేక పరీక్షను తప్పుదోవ పట్టించేందుకు అలా ప్రవర్తించాడా..? అనేది తెలుసుకోవడం క్లిష్టంగా మారింది’ అని వెల్లడించింది. దాంతో మరోసారి పాలిగ్రాఫ్ పరీక్ష చేయాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం అతడికి నార్కో అనాలసిస్‌ పరీక్ష చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు అతడిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన డాక్టర్‌కు సంబంధం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని