Jewellery Shop: నగల దుకాణంలో భారీ చోరీ.. రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన దొంగలు

దిల్లీలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణం స్ట్రాంగ్‌ రూమ్‌కు కన్నం వేసిన దొంగలు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

Published : 26 Sep 2023 15:01 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణం (Jewellery Shop) నుంచి సుమారు రూ. 25 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించారు. పక్కాప్రణాళికతో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీలోని భోగాల్‌ ప్రాంతంలో ఉమ్రావ్‌ జ్యూయలరీ దుకాణం ఉంది. ఎప్పటిలానే ఆదివారం పనివేళలు ముగిసిన తర్వాత సిబ్బంది దుకాణానికి తాళాలు వేశారు. ప్రతి సోమవారం సెలవు కావడంతో మంగళవారం ఉదయం షాపు తెరిచిన సిబ్బంది, చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

మద్యానికి బానిసైన కుమారుడికి తల్లిదండ్రుల మరణశాసనం

నాలుగు అంతస్థుల భవనంలో ఈ దుకాణం నిర్వహిస్తున్నారు. దోపిడీకి పాల్పడే సమయంలో సీసీటీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్ చేసిన దొంగలు.. భవనం పై భాగం నుంచి షాపులోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌కు డ్రిల్లింగ్‌ మెషిన్‌తో రంధ్రం చేసి నగలు చోరీ చేసి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న నగలతోపాటు, షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచిన ఆభరణాలను కూడా చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఇదే తరహా చోరీ హరియాణాలోని అంబాలాలోని కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో జరిగింది. బ్యాంకు గోడలకు డ్రిల్లింగ్ మెషిన్‌తో కన్నం వేసిన దొంగలు.. 32 లాకర్లలోని బంగారు ఆభరణాలను దోచికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని