
రూ.30 దొంగతనం: 31 ఏళ్ల తర్వాత అరెస్టు!
చండీగఢ్: అది హరియాణా రాష్ట్రంలోని కైతల్ అనే పట్టణం. స్థానిక కోర్టులో పోలీసులు ఓ వ్యక్తిని ముద్దాయిగా నిల్చొబెట్టారు. అతడు చేసిన నేరం ఏంటో తెలుసా? ఓ రైతు జేబులో నుంచి 30 రూపాయలు దొంగతనం. అది కూడా ఇప్పటి దొంగతనం కాదు.. 31 ఏళ్ల కిందటిది. పోలీసులు సైతం అప్పుడే అతడిని అరెస్టు చేశారు. దీంతో జైలుకెళ్లి బయటకు వచ్చాడు. మూడు దశాబ్దాల తర్వాత పోలీసులు అతడిని తిరిగి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసు భలే విచిత్రంగా ఉంది కదా..! పూర్తి వివరాల్లోకి వెళితే..
1990 డిసెంబర్ 3న జస్వంతి గ్రామానికి చెందిన కరమ్ సింగ్ అనే రైతు జేబులో నుంచి ఓ దొంగ రూ.30 ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు కైతల్ పట్టణంలోని సదార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని అదే రోజు దొంగను పట్టుకున్నారు. దొంగ పేరు సుభాష్‌గా గుర్తించారు. అతడి నుంచి రూ.30 స్వాధీనం చేసుకొని జైలుకు పంపించగా.. మరుసటి రోజే సుభాష్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. నిబంధనల ప్రకారం నిందితులు బెయిల్‌పై బయటకొచ్చినా.. పోలీసులు ఎప్పుడు పిలిచినా వచ్చేలా అందుబాటులో ఉండాలి. కానీ, సుభాష్ అక్కడి నుంచి పారిపోయి తిరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. దీంతో 1996లో సుభాష్‌ను పారిపోయిన నేరస్థుల జాబితాలో చేర్చారు.
అయితే, కొన్ని రోజుల కిందట కైతల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు పారిపోయిన నేరస్థులను తిరిగి అదుపులోకి తీసుకునే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో పలు చోట్ల దాడులు చేసి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో 31 ఏళ్ల కిందట రూ.30 దొంగతనం చేసిన సుభాష్ కూడా ఉన్నాడు. బుధవారం పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చారు. దీంతో సుభాష్ తన తప్పును ఒప్పుకున్నాడు. జైల్లో ఒక రోజు కూడా ఉన్నానని చెప్పాడు. దీంతో అతడు చేసిన నేరానికి ఒక రోజు జైల్లో ఉండటం వల్ల అప్పుడే శిక్షకాలం ముగిసిందని, ఇప్పుడు సుభాష్‌ను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం 52ఏళ్లు ఉన్న సుభాష్ 21ఏళ్ల వయసులో ఆ దొంగతనం చేశాడు. ఆ తర్వాత అతడు వివాహం చేసుకొని జీవనం కొనసాగించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.