Burglary: దొంగతనానికి వెళ్లి.. కిచిడీ వండి.. అడ్డంగా దొరికిపోయి..!

తీరిగ్గా ఇంట్లోకి చొరబడిన ఆ దొంగ.. ఆకలి వేయడంతో అదే ఇంట్లో వంటకు ఉపక్రమించాడు. అయితే ఈ చర్యే అతడిని పోలీసులకు పట్టించింది.......

Published : 13 Jan 2022 01:47 IST

గువాహటి: దొంగతనానికి వెళ్లిన వాళ్లు చడీచప్పుడు కాకుండా ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తారు. కానీ ఇక్కడ ఓ చోరుడు మాత్రం అలా చేయలేదు. తీరిగ్గా ఇంట్లోకి చొరబడిన ఆ దొంగకు ఆకలి వేయడంతో అదే ఇంట్లో వంటకు ఉపక్రమించాడు. అయితే ఈ చర్యే అతడిని పోలీసులకు పట్టించింది. అస్సాం గువాహటిలోని హెంగెరాబారి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన ఓ దొంగ తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. కొన్ని వస్తువులను పోగేసుకున్నాడు కూడా. అయితే అప్పటికే ఆకలిగా ఉండటంతో ఏదైనా తినాలనుకున్నాడు.

ఇంట్లో ఎవరూ లేరు కదా.. ఇక మనల్ని ఎవరేం చేస్తారు అనే ధైర్యమో ఏమో కానీ వంటిట్లోకి దూరిపోయి కిచిడీ వండటం ప్రారంభించాడు. అయితే వంటిట్లో నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన పక్కింటివారు.. గుమ్మం వద్దకు వెళ్లి చూశారు. తాళం పగలగొట్టినట్లు ఉండటాన్ని గుర్తించి.. నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి ఆ దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.

కాగా ఈ ఘటనపై అస్సాం పోలీసులు ట్విటర్‌ వేదికగా సరదా వ్యాఖ్యలు చేశారు. ‘ఆహార చోరుడి ఆసక్తికర కేసు’గా దీన్ని అభివర్ణించారు. ‘కిచిడీ ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దొంగతనానికి వెళ్లినప్పుడు దాన్ని వండటం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు’ అని చమత్కరించారు. ‘అరెస్టు చేసిన గువాహటి పోలీసులు ఆ దొంగకు వేడివేడి భోజనం వడ్డిస్తుండొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని