burglary: భలే దొంగ.. చోరీ కోసమే 5 కిలోల బరువు తగ్గాడు!

బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అతడు దొంగతనం

Published : 19 Nov 2021 01:48 IST

అహ్మదాబాద్‌: బరువు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆరోగ్యం కోసం కొందరు.. అందం కోసం కొందరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, ఓ వ్యక్తి కేవలం తన పాత యజమాని ఇంట్లో దొంగతనం చేయడం కోసమే 5 కిలోల బరువు తగ్గాడు. పక్కా ప్రణాళికతో రూ.లక్షలు చోరీచేసి పరారైనా.. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కి చెందిన మోతీ సింగ్‌ చౌహన్‌.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మోహిత్‌ మరాడియా అనే వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా పని చేసి.. మూడేళ్ల కిందట మానేశాడు. అయితే, మోహిత్‌ ఇంట్లో భారీగా నగదు, నగలు ఉండటం గమనించిన మోతీ సింగ్‌ ఎలాగైనా ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పని చేస్తున్న సమయంలోనే ఇంట, బయట సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ చోట నుంచి ఇంట్లోకి చొరబడే అవకాశాలున్నాయనే విషయాలను గమనించాడు. చివరికి ఓ గాజు కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తే.. సీసీకెమెరాలో కనిపించదని తెలుసుకున్నాడు. కానీ, అతడు కాస్త లావుగా ఉండటంతో ఆ సన్నటి కిటికీ గుండా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా ఆ కిటికీలో నుంచి దూరి దొంగతనం చేయాలని భావించిన మోతీ.. మూడు నెలలపాటు రోజుకు ఒక్కపూటే ఆహారం తింటూ 5 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత తన పాత యజమాని ఇంట్లో లేని సమయం చూసి చోరీకి పాల్పడ్డాడు. మొత్తం రూ.13.14లక్షలు విలువ చేసే నగదు, నగలు ఎత్తుకెళ్లాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మోతీ సింగ్‌ను గాలించడం మొదలుపెట్టారు. అయితే, గాజు కిటికీని పగలగొట్టానికి ఉపయోగించిన పరికరాన్ని మోతీ సింగ్‌ ఘటనాస్థలిలోనే వదిలేయడంతో దాని ఆధారంగా చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ పరికరం కొనుగోలు చేసిన దుకాణంలో మోతీ సింగ్‌ వివరాలు లభించడంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. కేవలం దొంగతనం చేయడం కోసమే నిందితుడు మూడు నెలలపాటు కఠిన ఆహార నియమాలు పాటించి 5 కిలోల బరువు తగ్గాడని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని