Bihar: పైప్‌లైన్‌కి కన్నం వేసి చమురు దొంగతనం.. ఇదీ అసలు ట్విస్ట్‌!

భూమి లోపల ఉన్న పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడటంపై అనుమానంతో దర్యాప్తు చేపట్టిన అధికారులకు అసలు విషయం తెలిసి విస్తుపోయారు. 

Published : 12 Jan 2023 00:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భూగర్భంలో ఏర్పాటు చేసిన క్రూడాయిల్‌ పైప్‌లైన్‌ నుంచి చమురు దొంగతనం చేసిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని ఖగారియా జిల్లాలో మంగళవారం ఉదయం పంట పొలాల్లో ముడిచమురు ప్రవాహాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో కొంతమంది బకెట్లు, బిందెల్లో చమురును ఎత్తుకొని పోవడం స్థానికంగా కలకలం రేపింది. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తొలుత లీకేజీగా భావించిన పోలీసులు.. ఇండియన్‌ ఆయిల్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సకాలంలో స్పందించి సరఫరా నిలిపివేశారు. భూమి లోపల ఆరు అడుగుల లోతులో ఉన్న పైప్‌లైన్‌కు రంధ్రం ఏర్పడటంపై అధికారులు అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు అసలు విషయం తెలియడంతో విస్తుపోయారు. 

పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అవుతున్న ముడి చమురుపై కన్నేసిన దొంగలు పక్కా ప్రణాళికతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు నిర్థారించారు. ముందురోజు రాత్రి కొందరు దొంగలు స్థానికులకు అనుమానం రాకుండా తమను తాము ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత భూమి లోపల ఉన్నపైప్‌లైన్‌కు రంధ్రం చేసి  తమ వెంట తెచ్చుకున్న ట్యాంకర్‌లో క్రూడ్‌ ఆయిల్ నింపి, అక్కడి నుంచి జారుకున్నారు. వారు ట్యాంకర్‌ ద్వారా ఆయిల్ తీసుకెళ్లిన విషయాన్ని గ్రామస్థులు సైతం ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఇండియన్‌ ఆయిల్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని