Mumbai: ‘ఈడీ’ అన్నారు.. బేడీలూ వేశారు.. 3 కిలోల బంగారంతో పరారయ్యారు!

ఈడీ అధికారులుగా నటిస్తూ ఓ వ్యాపారి నుంచి 3 కిలోల బంగారం, రూ.15 లక్షలు కొల్లగొట్టిందో ముఠా. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 24 Jan 2023 23:44 IST

ముంబయి: ఈడీ(ED) అధికారులుగా నటిస్తూ ఆరుగురు సభ్యుల ముఠా ముంబయి(Mumbai)లోని ఓ వ్యాపారి నుంచి 3 కిలోల బంగారం, రూ.25 లక్షలు లూటీ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆరుగురు సభ్యుల ముఠా ఈడీ అధికారులుగా నటిస్తూ ఇక్కడి జావేరి బజార్‌(Zaveri Bazar)లోని ఓ బంగారం వ్యాపారి కార్యాలయాల్లోకి ప్రవేశించింది. యజమాని గురించి ఆరా తీస్తూ.. అక్కడి దస్త్రాలను తనిఖీ చేస్తూ హడావుడి చేశారు. అక్కడి సిబ్బందిపైనా దాడి చేశారు. వారిలో ఒకరికి సంకెళ్లు కూడా వేశారు. తమ ప్రవర్తనలో ఎక్కడా అనుమానం రాకుండా వ్యవహరించడంతో.. సిబ్బంది సైతం మిన్నకుండిపోయారు.

ఈ క్రమంలోనే రెండు కార్యాలయాల నుంచి మూడు కిలోల బంగారం, రూ.25 లక్షల నగదుతో ఉడాయించారు. అనంతరం తనిఖీలపై సదరు వ్యాపారి ఆ ప్రాంతంలోని ఇతర సంస్థల యజమానులను విచారించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో కంగుతిన్న ఆయన.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల్లో ఇద్దరిని ముంబయిలో పట్టుకున్నారు. రత్నగిరిలో ఓ మహిళను గుర్తించారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల బంగారం, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, నేరానికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని