
Crime: దొంగలు పడ్డారు..అయితే డబ్బుకోసం కాదు..
ముంబయి: సాధారణంగా దొంగలు పడి డబ్బు, నగలు దోచుకెళ్తారు. కానీ, ముంబయిలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్‌లో దొంగలు పడి కొన్ని వందల కిలోల బరువున్న భారీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. అందుకోసం పెద్ద సొరంగం తవ్వడం గమనార్హం.
అరే ప్రాంతంలోని ఇంపీరియల్ ప్యాలెస్ అనే హోటల్‌కు వెనుకవైపు నుంచి దొంగలు కొన్ని రోజులపాటు కష్టపడి సొరంగాన్ని తవ్వారు. అనంతరం హోటల్‌లోకి ప్రవేశించి.. అక్కడున్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు. ఆ విగ్రహాన్ని ఇటలీలో తయారు చేశారట. దీని ధర దాదాపు.. రూ.7లక్షలు ఉంటుందని అంచనా. కొన్ని రోజుల కిందట.. హోటల్ సిబ్బంది ఆ విగ్రహం కనిపించట్లేదని అరే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ వెనుకవైపు ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టగా విగ్రహానికి సంబంధించిన 300కిలోలకుపైగా బరువున్న పలు భాగాలు లభించాయి. దర్యాప్తును ముమ్మరం చేయగా.. ఇది పావై పథాక్ అనే విగ్రహాల దొంగల గ్యాంగ్ చేసిన పనిగా గుర్తించారు. ఆ గ్యాంగ్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా విడదీసి అరే అటవీ ప్రాంతంలో దాచిపెట్టి.. కొన్నాళ్ల తర్వాత విక్రయించాలని దొంగలు భావించారట. అలా దొంగలు విగ్రహపు భాగాలను కుర్లాలో విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో హోటల్ మూతపడగా.. చిన్న చిన్న కాంస్య విగ్రహాలు, విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. కానీ, ఈ సారి భారీ విగ్రహం చోరీకి గురికావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.