Vande Bharat: పట్టాలపై మద్యం తాగి.. ‘వందే భారత్‌’పై దాడి కేసులో ముగ్గురి అరెస్టు

విశాఖ నగరంలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ట్రయల్‌ రన్‌ కోసం చెన్నై నుంచి నగరానికి వచ్చిన ఈ రైలుపై కంచరపాలెం ప్రాంతంలో కొందరు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు పగిలాయి.

Updated : 13 Jan 2023 13:51 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం ట్రయల్‌ రన్‌ కోసం చెన్నై నుంచి నగరానికి వచ్చిన ఈ రైలుపై కంచరపాలెం ప్రాంతంలో కొందరు రాళ్లు విసరడంతో బోగీల అద్దాలు పగిలాయి. ఈ కేసును పోలీసులు, రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, రైల్వే, ఆర్పీఎఫ్‌ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. డీసీపీ-2 ఆనందరెడ్డి కంచరపాలెం పోలీసు స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మదీనాబాగ్‌కు చెందిన గోశాల శంకర్‌ (22), తన స్నేహితులు చందు (21), పి.రాజ్‌కుమార్‌ (19)లతో కలిసి అండర్‌ బ్రిడ్జి వద్ద మద్యం తాగుతూ కూర్చున్నాడు. అదే సమయంలో వందేభారత్‌ రైలు రావడంతో దానిపైకి రాళ్లు రువ్వారు. దూరం నుంచి అది చూసి ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంబడించగా పరుగు తీశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించారు. గోశాల శంకర్‌పై సస్పెక్ట్‌ షీట్‌, 4 ఆస్తి సంబంధిత నేరాల కేసులున్నాయి. మదీనాబాగ్‌కు చెందిన టి.చందుపై గతంలో జీఆర్పీ స్టేషన్‌లో ఓ కేసుంది. మరో నిందితుడు రాజ్‌కుమార్‌ (19)ను కూడా అరెస్టు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని