కరోనా మందులంటూ విషపు గోలీలు.. ముగ్గురి మృతి

తమిళనాడులోని ఎరోడేలో దారుణం చోటుచేసుకుంది. కరోనా నివారణ మాత్రల ముసుగులో విష గలికలు ఇవ్వడంతో ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు....

Published : 29 Jun 2021 01:40 IST

చెన్నై: తమిళనాడులోని ఈరోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా నివారణ మాత్రల ముసుగులో విషగుళికలు ఇవ్వడంతో ఒకే  కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కీలవాణి గ్రామానికి చెందిన ఆర్‌.కల్యాణసుందరం (43).. మరో గ్రామానికి చెందిన కరుప్పనగౌండర్‌ (72) వద్ద కొద్ది నెలల క్రితం రూ.15 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని కరుప్పనగౌండర్‌ ఎన్నిసార్లు అడిగినా.. అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తూ వస్తున్నాడు. రుణదాత నుంచి మరింత ఒత్తిడి పెరగడంతో అతడి కుటుంబం మొత్తాన్ని హతమార్చాలని కల్యాణసుందరం పథకం రచించాడు. ఇందుకు సబారి (25) అనే మరో వ్యక్తి సాయం కోరాడు.

ఉష్ణోగ్రత చూసే పరికరం, పల్స్‌ ఆక్సీమీటర్‌తో ఆరోగ్య సిబ్బంది వేషంలో సబారి జూన్‌ 26న కరుప్పనగౌండర్‌ ఇంటికి వెళ్లాడు. అతడి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశాడు. రోగనిరోధక శక్తిని పెంచుతాయంటూ వారికి కొన్ని మాత్రలు ఇచ్చి.. అవి వేసుకోవాలని సూచించి వచ్చేశాడు. కరుప్పనగౌండర్‌తోపాటు ఆయన భార్య మల్లిక, కుమార్తె దీప, వారింట్లో పనిచేసే కుప్పల్‌ ఆ మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలిపోయారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మల్లిక మృతిచెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీప, కుప్పల్‌ మరుసటిరోజు మరణించారు. కరుప్పనగౌండర్‌ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. కల్యాణసుందరంతోపాటు సబారిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని