
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
గజ్వేల్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మంచిర్యాల జిల్లాలోని తాండూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో అంజిబాబు (33) అనే వ్యక్తి తాండూరు సర్పంచి. మిగిలిన ఇద్దరు సాయిప్రసాద్(25), గణేష్(25). సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. లారీలో ఇరుక్కుపోయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీసి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు బానేష్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన పెండింగ్ పని కోసం వీరంతా తాండూరు నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి కారులో బయలుదేరారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement