Crime News: గ్లాస్‌ బాటిల్‌లో టపాసులు కాలుస్తుంటే అడ్డుకున్న వ్యక్తి.. కత్తితో పొడిచి చంపిన మైనర్లు

గ్లాసు బాటిల్‌లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నందుకు ముంబయిలో  ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇంకో బాలుడు పరారీలో ఉన్నాడు.

Updated : 25 Oct 2022 03:23 IST

ముంబయి: గ్లాసు బాటిల్‌లో టపాసులు కాల్చడాన్ని అడ్డుకోవడమే అతడి పాలిట మృత్యుపాశమైంది. గ్లాసు పేలి గాజు ముక్కలు ఎవరికి గుచ్చకుంటాయో అన్న ఆలోచనే అతడిని విగతజీవిని చేసింది. దీపావళి వేడుకలు అందరి ఇంట్లో సంతోషాలను నింపితే ఆ వ్యక్తి కుటంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీపావళి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టపాసులు కాలుస్తూ, బాణసంచా వెలుగుల్లో ప్రజలు ఆనందపరవశులు అయ్యారు. అయితే ఈ వేడుకల్లో జరిగిన ఓ చిన్నవివాదం వ్యక్తి ప్రాణాలను తీసింది. టపాసులు కాల్చడాన్ని అడ్డుకున్నందుకు ముగ్గురు మైనర్లు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి చంపారు. ఈ సంఘటన ముంబయిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల సునీల్‌ శంకర్‌ నాయుడిగా గుర్తించారు. 

ముంబయిలోని శివాజీ నగర్‌లో 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్‌లో టపాసులు ఉంచి పేలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండడంతో గమనించిన సునీల్‌ నాయుడు అక్కడికి వచ్చి ఆ బాలుడికి అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ గమనించి బాలుడి అన్న(15 ఏళ్లు), అతని స్నేహితుడు(14)తో అక్కడికి చేరుకొని ముగ్గురు కలిసి బాధితుడిని కొట్టారు. ఈ క్రమంలో బాలుడి అన్న కత్తితో ఆ వ్యక్తిని పొడిచాడు. తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సునీల్‌ నాయుడు మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వ్యక్తి మృతికి కారణమైన బాలుడి అన్న, అతడి స్నేహితుడిని అరెస్టు చేశారు. మరో బాలుడి కోసం గాలింపు చేపట్టారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని