Madhya Pradesh: దారుణం.. మహిళకు నిప్పంటించి, వీడియోలు తీసి..!

మధ్యప్రదేశ్‌లో ఇరువర్గాల మధ్య భూవివాదం అమానవీయ ఘటనకు దారితీసింది. పొలంలో ఉన్న ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులు నిప్పటించి, ఆ ఘటనను వీడియో తీసి అత్యంత దారుణానికి పాల్పడ్డారు.

Updated : 04 Jul 2022 13:31 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఇరువర్గాల మధ్య భూవివాదం అమానవీయ ఘటనకు దారితీసింది. పొలంలో ఉన్న ఓ మహిళకు ముగ్గురు వ్యక్తులు నిప్పటించి, ఆ ఘటనను వీడియో తీసి అత్యంత దారుణానికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారని బాధితురాలి భర్త పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం ఆ మహిళ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుణ జిల్లాకు చెందిన బాధితురాలి పేరు రాంప్యారీ సహరియా. సంక్షేమ పథకంలో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆమె కుటుంబానికి కొంత భూమి కేటాయించింది. ఆ భూమిని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించగా.. ఇటీవలే రెవెన్యూ విభాగం దానిని విడిపించి, సహరియా కుటుంబానికి ఇప్పించింది. ఈ క్రమంలో బాధితురాలిపై దాడి జరిగింది. ఆమె భర్త అర్జున్ పొలం వద్దకు వెళ్తుండగా.. ఆ నిందితులు ట్రాక్టర్‌పై వెళ్లిపోవడాన్ని గమనించాడు. అనుమానం వచ్చి తన పొలం వైపు చూడగా.. పొగలు రావడం కనిపించింది. దగ్గరకు వెళ్లగా అతడి భార్య మంటల్లో కాలి, తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించాడు. నిప్పంటించి, వీడియోలు తీసిన విషయాన్ని తన భార్య చెప్పినట్లు అర్జున్ పోలీసులకు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు  చేశారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  

కాగా, ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపాపై విపక్షాలు మండిపడుతున్నాయి. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ మహిళను నిలబెట్టిన పార్టీ ఒక గిరిజన మహిళపై ఈ స్థాయి దారుణానికి అనుమతించింది. ఇది సిగ్గుచేటు చర్య’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని