Crime news: ఒకే హాస్టల్‌లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని ‘కోట’ పట్టణంలో ఒకే హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒత్తిడే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Published : 12 Dec 2022 20:52 IST

జైపూర్‌: జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్న కోరికతో వారంతా అప్పుడప్పుడే  అడుగులు వేస్తున్నారు. మంచి కళాశాలల్లో సీటు తెచ్చుకోవాలన్న తపనతో పోటీపరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. తమ కర్తవ్యాన్ని మర్చిపోయారో, ఒత్తిడిని తట్టుకోలేకపోయారో, లేదంటే ఇంకేం జరిగిందో తెలియదుగానీ ఒకే హాస్టల్లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ‘కోట’ పట్టణంలో చోటు చేసుకుంది. మృతులు ముగ్గురూ 18 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. వీరిలో ఇద్దర్ని బిహార్‌కు చెందిన అనుష్‌, ఉజ్వల్‌గా గుర్తించారు. వారిద్దరూ స్నేహితులే. కోటాలోని ఓ హస్టల్‌లో పక్క పక్క గదుల్లో ఉంటున్నారు. ఒకరు ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతుండగా.. మరొకరు మెడికల్‌ కాలేజీ ఎంట్రెన్స్‌ టెస్టు కోసం చదువుతున్నాడు. మరో విద్యార్థి ప్రణవ్‌ నీట్‌ పరీక్ష కోసం సన్నద్ధమయ్యేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చాడు. ఈ ముగ్గురూ ఒకే రోజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. ఆత్మహత్య లేఖ లాంటి ఆధారాలేమీ లభించలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

వివిధ ఎంట్రెన్స్‌ టెస్టులు, పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు కోట ప్రసిద్ధి చెందింది. కేవలం రాజస్థాన్‌ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి కోచింగ్‌ తీసుకుంటారు. ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు సంపాదించాలనే ఉద్దేశంతో 11, 12 తరగతులు చదువుతున్నప్పుడే విద్యార్థులను వారి తల్లిదండ్రులు కోచింగ్‌ సెంటర్లలో జాయిన్‌ చేస్తుంటారు. ప్రస్తుత కాంపిటిషన్‌ను ఎదుర్కొనేందుకు వీలుగా కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తారు. విద్యార్థులను బృందాలుగా విడదీసి, ప్రమోషన్‌, డిమోషన్‌ పేరుతో వారిని బ్యాచ్‌లు మారుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తట్టుకోలేకే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇలా విద్యార్థులు ‘కోట’లో ఆత్మహత్యకు పాల్పడటం ఇదే తొలిసారి కాదు. 2016లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ.. ఇక్కడ పూర్తిగా కోచింగ్‌ సెంటర్లే లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేఖ రాసి మరీ హాస్టల్‌ పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కోచింగ్‌ సెంటర్ల నియంత్రణపై అధ్యయనం చేసేందుకు 2019లో రాజస్థాన్‌ ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందంటే విద్యార్థులపై కోచింగ్‌ సెంటర్ల ప్రభావం అక్కడ ఎంతమేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని