Love: ప్రేయసి కోసం 13 బైకులు దొంగిలించి..!

మహారాష్ట్రలోని ఓ యువకుడు ప్రేయసిని మెప్పించేందుకు 13 బైకులను చోరీ చేశాడు. చివరికి పోలీసులకు చిక్కిపోయాడు.

Published : 26 Jan 2023 19:36 IST

థానే: ప్రేయసి (Girlfriend)ని ఆకట్టుకోవడానికి కొందరు గిఫ్ట్‌ (Gift)లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. ఇంకొందరు ఆమెకు ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్తుంటారు. సినిమాలు (Movies), షికార్లకు తిప్పుతారు. కానీ, మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఓ యువకుడు మాత్రం ప్రేయసి కోసం ఏకంగా 13 బైకులను దొంగిలించాడు. వివరాలను డీసీపీ సచిన్‌ గుంజాల్‌ మీడియాకు వెల్లడించారు. నిందితుడు శుభం భాస్కర్‌ పవార్‌ తన ప్రేయసిని ప్రసన్నం చేసుకునేందుకు ఖరీదైన బైకులను దొంగతనం చేసి, వాటిపై ఆమెను తిప్పేవాడన్నారు. అలా ఇప్పటి వరకు 13 ద్విచక్రవాహనాలను చోరీ చేశాడని, వాటి విలువ దాదాపు రూ.16 లక్షలకు పైగా ఉంటుందని చెప్పారు. బైకు దొంగతనం కేసులో సోమవారం అతడిని అరెస్టు చేసిన పోలీసులు..తమదైన శైలిలో విచారణ చేయగా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. చోరీ చేసిన బైకులను అతడు సోలాపూర్‌, లాతూర్‌,పూణె తదితర చోట్లు ఉంచినట్లు తెలుసుకున్న పోలీసులు వాటిని రికవరీ చేశారు. అయితే, రోజుకో బైకుతో ప్రేయసిని తిప్పేందుకే అతడు చోరీలకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు దీనిపై సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని