Kamareddy: తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు అది తెరుచుకోకపోవడంతో ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Updated : 10 Jul 2024 10:04 IST

అందులో రూ.3.97 లక్షల నగదు నిల్వ

ఏటీఎంను వాహనంలో ఎక్కిస్తుండగా సీసీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యం

బిచ్కుంద, జుక్కల్, న్యూస్‌టుడే: ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు అది తెరుచుకోకపోవడంతో ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్‌ వాహనంలో బిచ్కుందకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో తమ వాహనానికి కట్టి లాగారు. అనంతరం గది అద్దాల తలుపును ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నిక్షిప్తమైంది. దొంగిలిస్తున్న సమయంలో సైరన్‌ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ వారు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పారిపోయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్‌ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్‌ చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్‌ మండలం పెద్దఏడ్గి గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలను సైతం చోరీ చేశారని జుక్కల్‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని