Gold: 36 కిలోల బంగారం స్వాధీనం.. ముఠా అరెస్టు

ముంబయిలో 36 కేజీల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు. 21 కోట్లు ఉంటుందని అంచనా.

Published : 24 Jan 2023 22:15 IST

ముంబయి: బంగారం స్మగ్లింగ్‌ ముఠాను ముంబయిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) చాకచక్యంగా పట్టుకుంది. వారి నుంచి 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. డీఆర్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల కాలంలో ఎయిర్‌పోర్టు, ఎయిర్‌కార్గో ద్వారా అక్రమంగా బంగారాన్ని తీసుకురావడం ఎక్కువైంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు డీఆర్‌ఐ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ముంబయి విమానాశ్రయంలో చోటు చేసుకున్న అక్రమబంగారం రవాణా కేసులపై ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో వివిధ చోట్ల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ పెద్ద ముఠా అక్రమంగా బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చి హవాలా మార్గంలో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం వెనుక విదేశీయుల హస్తం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు.

విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వారి ద్వారా ఈ ముఠా అక్రమంగా బంగారాన్ని సేకరిస్తుంది. క్యాప్సిల్స్‌, వివిధ రూపాల్లో భారత్‌కు చేరిన బంగారాన్ని ఈ ముఠా మళ్లీ ప్రాసెస్‌ చేస్తుంది. వీటిని బిస్కెట్ల రూపంలో తయారు చేసి, అక్రమంగా విక్రయిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై పక్కా సమాచారం ఉన్న డీఆర్‌ఐ ప్రత్యేక బృందం సోమవారం సోదాలు నిర్వహించింది. వివిధ ప్రాసెసింగ్‌ దశల్లో ఉన్న 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా రూ.20 లక్షలకు పైగా నగదును కూడా ముఠా నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ వెల్లడించింది. ఈ ముఠా వెనుక ఇంకెవరెవరు ఉన్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని