రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్‌.. ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో 3.7కిలోల బంగారం

తమిళనాడు రాజధాని చెన్నైలో గతవారం ఓ ఆభరణాల రుణ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలు అందరూ

Published : 19 Aug 2022 12:42 IST

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో గతవారం ఓ ఆభరణాల రుణ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే సంస్థ ఆఫీసులోకి చొరబడిన దుండగులు సిబ్బందిని బెదిరించి రూ.20కోట్ల విలువైన నగలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. దోపిడీ చేసిన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో లభించడం కలకలం రేపుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ ఇంటి నుంచి 3.7 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెన్నైలోని అరుంబాక్కంలో ఓ బ్రాంచ్‌ ఉంది. ఆగస్టు 13న మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ బ్రాంచీలోకి కొందరు దుండగులు చొరబడ్డారు. సిబ్బంది, కస్టమర్లను కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. ఆపై రూ.20కోట్ల విలువైన నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఫెడ్‌బ్యాంకులో పనిచేసే వ్యక్తులే దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రధాన నిందితుడిగా మురుగున్‌ అనే వ్యక్తి ఉన్నట్లు అనుమానించారు. నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.

ఘటన జరిగిన మరుసటి రోజే సంతోష్‌, బాలాజీ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.8.5కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజు మురుగున్‌, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. అయితే విచారణలో నిందితుడు సంతోష్‌ కీలక సమాచారమిచ్చాడు. తాను దోచుకున్న నగల్లో కొన్నింటిని అచరపాక్కమ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమల్‌రాజ్‌ ఇంట్లో దాచిపెట్టినట్లు తెలిపాడు. అంతేగాక, నిందితుడు సంతోష్‌.. అమల్‌రాజ్‌ భార్యకు బంధువు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. గురువారం ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో సోదాలు జరపగా 3.7కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అమల్‌రాజ్‌, ఆయన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ దోపిడీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇన్‌స్పెక్టర్‌ చెబుతున్నారు. ఘటన జరిగిన రాత్రి సంతోష్‌ తమ ఇంటికి వచ్చాడని, అతడి వద్ద బంగారం ఉన్నట్లు తమకు తెలియదన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని