Hyderabad: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో ట్విస్ట్‌!

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. నగదు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు క్యాషియర్‌ ప్రవీన్..

Published : 13 May 2022 02:13 IST

హైదరాబాద్‌: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. నగదు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు క్యాషియర్‌ ప్రవీణ్‌.. తాను నగదు తీసుకెళ్ళలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. బ్యాంకు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తాను చోరీ చేసినట్లు ఆరోపిస్తున్నారని ప్రవీణ్ వీడియోలో వివరించారు.

‘‘గత రెండు నెలలుగా నగదు తక్కువగా వస్తున్నట్లు మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. మేనేజర్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థతి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో కడుపునొప్పి రావడంతో ఇంటికి వెళ్తున్నానని చెప్పి బ్యాంకు నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. బ్యాంకు మేనేజర్, సిబ్బంది కలిసి సేఫ్ లాకర్‌లో నగదు తీసి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బ్యాంకులో నుంచి వెళ్లిన సమయంలో సీసీ కెమెరాలతో పాటు సేఫ్‌ లాకర్‌లో బీరువాకు ఉండే సీసీ కెమెరాలను పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది’’ అని వీడియోలో ప్రవీణ్‌ వెల్లడించారు.

వనస్థలిపురంలోని సాహెబ్‌ నగర్‌ బ్రాంచ్‌లో రూ.22.53 లక్షల నగదుతో క్యాషియర్‌ ప్రవీణ్‌ పరారైనట్లు బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ తల్లిని పోలీసులు ప్రశ్నించారు. క్రికెట్, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోయాయని తల్లి చరవాణికి ప్రవీణ్‌ సందేశం పెట్టి... ఆ తర్వాత ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్‌ కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా ప్రవీణ్‌ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు కేసులో ప్రవీణ్ నిందితుడిగా ఉన్నాడని... విచారణ పూర్తయ్యే వరకు ప్రవీణ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని