Visakhapatnam: వధువు మృతిలో ట్విస్ట్‌.. ఇష్టం లేని పెళ్లికి సిద్ధమవడంతోనేనా?

విశాఖ నగరంలోని మధురవాడ పెళ్లివేడుకలో అస్వస్థతకు గురై వధువు మృతిచెందిన ఘటన మలుపు తిరిగింది.

Updated : 12 May 2022 18:55 IST

మధురవాడ: విశాఖ నగరంలోని మధురవాడ పెళ్లివేడుకలో అస్వస్థతకు గురై వధువు మృతిచెందిన ఘటన మలుపు తిరిగింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వధువు సృజన విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. సృజనకు ఈ పెళ్లి ఇష్టంలేదనే విషయాన్ని కొంతమంది ఆమె సన్నిహితుల ద్వారా తెలుసుకున్న పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. రెండురోజులుగా ఆమెకు అస్వస్థతగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించి పెళ్లి వేడుకకు సిద్ధం చేశారు. పెళ్లి ఇష్టం లేక గన్నేరుపప్పు తిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు వధువు బ్యాగులో గన్నేరుపప్పును గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టం చేసిన తర్వాత శరీరంలో విష అవశేషాలు ఏమైనా ఉన్నాయా?లేదా? అనే విషయం తేలనుంది. ఆ తర్వాతే సృజనది ఆత్మహత్యేనా?ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

ఏం జరిగిందంటే..

విశాఖపట్నం మధురవాడలోని వివాహ వేడుకలో పెళ్లిపీటలపైనే వధువు సృజన స్పృహ కోల్పోయింది. శివాజీ, సృజనల వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులు సాయంత్రం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. అనంతరం వివాహం జరుగుతున్న సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన కిందపడిపోయింది. దీంతో ఆమెను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందింది. పెళ్లికుమార్తె మృతితో ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని