Boat Accident: బ్రహ్మపుత్ర నదిలో విషాదం.. 100 మందితో వెళ్తున్న రెండు పడవలు ఢీ!

అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో విషాద ఘటన చోటుచేసుకుంది. జోర్హాత్‌లో నిమతి ఘాట్‌ వద్ద  రెండు ప్రయాణికుల ......

Updated : 08 Sep 2021 20:59 IST

గువాహటి: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పెను విషాదం చోటుచేసుకుంది. జోర్హాత్‌లో నిమతి ఘాట్‌ వద్ద  రెండు ప్రయాణికుల పడవలు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం సమయంలో ఈ పడవల్లో మొత్తంగా 120 మంది ప్రయాణికులు ఉన్నట్టు అదికారులు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని రక్షించగా.. గల్లంతైన మిగతా 70మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఎంతమంది మరణించిందీ ఇప్పుడే చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. అసోం రాజధాని గువాహటికి 350 కి.మీల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన పడవల్లో ఒకటి మజులి నుంచి నిమతి ఘాట్‌కు వస్తుండగా.. ఇంకో పడవ ఎదురుగా వెళ్తుండగా ఒకదానినొకటి పరస్పరం ఢీకొట్టాయి. 

ప్రమాదానికి కారణమదేనా?

ఈ ప్రమాదంలో చిక్కుకున్న కొందరు ప్రయాణికులు నీళ్లలోకి దూకి తమను తాము రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు వీడియోల్లో రికార్డయింది. మరోవైపు, ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీతో ఉన్న మోటార్‌ బైకులు, కార్లు సైతం కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకొని సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదానికి కారణం పడవల్లో కార్లు, బైక్‌లు ఉండటం వల్లేనని అధికారులు భావిస్తున్నారు.

సహాయక చర్యలకు సీఎం ఆదేశం..

ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ విషాదం తననెంతగానో బాధించిందని ట్వీట్‌ చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సహకారంతో సహాయక చర్యలు చేపట్టాలని మజులి, జోర్హాత్‌ జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి బిమల్‌ బోరాను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనా స్థలాన్ని గురువారం తాను సందర్శిస్తానని వెల్లడించారు. అక్కడి పరిణామాలను సీఎం ముఖ్యకార్యదర్శి సమీర్‌ కుమార్‌ సిన్హా సమీక్షిస్తున్నారు. 

ప్రధాని విచారం..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థించారు. గల్లంతైనవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని