Road Accident: రీల్స్‌ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు.

Updated : 16 Jun 2024 09:35 IST

స్కూటీపై ప్రయాణిస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ 
రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో ప్రమాదం 
ప్రాణాపాయ స్థితిలో మరొకరు

మూసాపేట, న్యూస్‌టుడే: స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్‌ఫోన్‌లో రీల్స్‌ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కూకట్‌పల్లి పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీ భవానీనగర్‌కు చెందిన సంధ్య ఉదయ్‌కుమార్‌(17), సాయిబాబానగర్‌ నివాసి శివదీక్షిత్‌(17), మల్లారెడ్డినగర్‌కు చెందిన మరో బాలుడు(17) చిన్ననాటి స్నేహితులు. ముగ్గురూ ఇంటర్‌ పూర్తిచేశారు. శనివారం మల్లారెడ్డినగర్‌కు చెందిన బాలుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. తర్వాత ముగ్గురు కలిసి తెలిసిన వ్యక్తి స్కూటీపై మాదాపూర్‌లోని తీగల వంతెన వద్దకు బయలుదేరారు. ఉదయ్‌కుమార్‌ స్కూటీ నడుపుతున్నాడు. ఫోరంమాల్‌ మీదుగా హైటెక్‌సిటీ వైపు వెళ్లేందుకు కూకట్‌పల్లి వైపు వచ్చారు. రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ పిల్లరు నంబరు 822 వద్ద ఓ డీసీఎం రోడ్డు పక్కన ఆగి ఉంది. అర్ధరాత్రి తర్వాత 2.18 గంటల సమయంలో ముగ్గురు స్కూటీపైనే రీల్స్‌ చేస్తూ.. డీసీఎంను వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే ఉదయ్‌కుమార్, శివదీక్షిత్‌ దుర్మరణం చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మరో బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డీసీఎం డ్రైవర్‌ చిరునామా కనుక్కోవడానికి పక్కన ఆపి.. సూచికలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకాంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని