హైదరాబాద్‌లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్సిళ్లు దింపుతుండగా సంభవించిన పేలుడు ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ ఇద్దరిని అరెస్టు చేసింది. హైదరాబాద్ నాంపల్లికి

Published : 01 Jul 2021 01:22 IST

హైదరాబాద్: బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్సిళ్లు దింపుతుండగా సంభవించిన పేలుడు ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ ఇద్దరిని అరెస్టు చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నాసిర్‌ ఖాన్‌లను అదుపులోకి తీసుకుంది.

‘‘ఇమ్రాన్ ఖాన్, నసీర్ ఖాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు. దర్భంగా రైల్వే స్టేషన్‌లో జూన్ 17న పార్శిల్ బాంబు పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ నుంచి పార్శిల్ వెళ్లినట్లు గుర్తించాం. దేశవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తినష్టం జరిగేలా లష్కరే తొయిబా కుట్ర పన్నింది. నాసిర్‌ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడు. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడు. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైళ్లో పార్శిల్ పంపారు. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర పన్నారు. నాసిర్‌, ఇమ్రాన్ లష్కరే తొయిబా ఉగ్రవాదులతో సంప్రదింపులు జురుపుతున్నారు. నిందితులను లోతుగా ప్రశ్నిస్తే భారీ కుట్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

అసలేం జరిగింది..

ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు సంభవించింది. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. తదుపరి దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్‌ సికింద్రాబాద్‌లో బుక్‌ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దిల్లీ ఎన్‌ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్‌, యూపీ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. విచారణలో భాగంగా హైదరాబాద్‌లో జూన్‌ 15న మహ్మద్‌ సుఫియాన్‌ అనే పేరుతో పార్సిల్‌ బుక్‌ చేసినట్లు తెలిసింది. దీనికి రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్‌ హజీ సలీమ్‌ ఖాసీం, మహ్మద్‌ కాఫిల్‌ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్లో ఇమ్రాన్‌, నాసిర్‌లను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ కోసం దిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని