Vijayawada: విజయవాడలో రెండు వర్గాల వీరంగం

విజయవాడలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వీధి పోరుకు దారి తీసింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Updated : 04 Mar 2023 08:26 IST

పరస్పర దాడుల్లో ఇద్దరికి కత్తిపోట్లు
భయాందోళనలో బ్రహ్మంగారిమఠం వీధి వాసులు

విజయవాడ(చిట్టినగర్‌), న్యూస్‌టుడే : విజయవాడలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వీధి పోరుకు దారి తీసింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడలోని ఆంజనేయవాగు, బ్రహ్మంగారి మఠం వీధి, కొండ ప్రాంతంలో నివసిస్తూ పాత దుస్తుల వ్యాపారం చేసే వారికి, చిట్టినగర్‌ కటికల మస్తాన్‌వీధి, వలివీధికి చెందిన కొందరికి మధ్య ఏళ్లుగా ఆధిపత్య పోరు ఉంది. ఈ నెల 2న రాత్రి బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన గని, గాలీబ్‌కు ఈద్గామహల్‌ వెనుక రోడ్డుకు చెందిన దుర్గేష్‌కు మధ్య చిట్టినగర్‌లో స్వల్ప వివాదం నెలకొంది. అది చినిచినికి గాలివాన అయినట్లు.. అదే రోజు రాత్రి రెండు వర్గాలు పలుమార్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. చివరికి దుర్గేష్‌ స్నేహితుడు సంతోష్‌, గని వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుడి సమీప బంధువు, గని, గాలీబ్‌ల స్నేహితుడు హరి జోక్యం చేసుకొని గొడవలు ఎందుకు 48వ డివిజన్‌ వైకాపా కార్యాలయం వద్దకు వస్తే కూర్చొని మాట్లాడుకుందామని ఇరువర్గాలకు చెప్పాడు. హరి చెప్పినట్లే శుక్రవారం దుర్గేష్‌ వర్గానికి చెందిన కొందరు యువకులు సదరు కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ హరిని చూసి రాత్రి గొడవలో అతనూ ఉన్నాడని గుర్తించి దాడికి దిగారు. గంజాయి, మద్యం మత్తులో వారంతా దాడికి దిగడంతో హరి పదునైన (కత్తిలాంటి) ఆయుధంతో ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. అందులో అఖిల్‌, శ్రీనివాసరెడ్డికి కత్తిపోట్లు పడ్డాయి. గాయపడ్డ వారంతా పోలీసు స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవతో బ్రహ్మంగారి మఠం వీధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తపేట పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండలం ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ.. ‘ఈ గొడవలో బ్లేడు, గంజాయి బ్యాచ్‌ వారు ఎవరూ లేరు. ఏ ఒక్కరిపైనా గతంలో కేసులు లేవు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని