Hyderabad: ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌.. గంటల వ్యవధిలో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న తల్లిదండ్రుల వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్‌ చేసిన నిందితులను పోలీసులు గంటల వ్యవధిలో అరెస్టు చేసి చిన్నారులను సురక్షితంగా కాపాడారు.

Updated : 04 Jun 2023 20:28 IST

రెజిమెంటల్‌బజార్(హైదరాబాద్‌): సికింద్రాబాద్, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్‌ చేసిన ఓ మహిళతో పాటు ఆటోడ్రైవర్‌ను మహంకాళి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్లు కావేటి శ్రీనివాసులు, నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

ఫలాక్‌నుమా ఇస్పాన్‌ హోటల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్‌ ఇమ్రాన్‌ (36) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్‌ టౌన్‌లో నివాసం ఉండే సలీమ్‌ భార్య పర్వీన్‌ (30) గృహిణి. ఇంట్లో భర్తతో గొడవపడి శుక్రవారం నగరానికి వచ్చింది. అనంతరం కోఠి ప్రాంతానికి వెళ్లి అక్కడే ఫుట్‌పాత్‌పై ఉండగా శనివారం రాత్రి ఆటోడ్రైవర్‌ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి చిన్నారుల అపహరణకు తెరలేపారు.

పథకం ప్రకారమే కిడ్నాప్‌లు..

కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన కాలే దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. గత 30 ఏళ్లగా హైదరాబాద్‌లోని ప్రధాన జంక్షన్ల వద్ద బెలూన్‌లను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఏడుగురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం ప్యారడైజ్‌ ప్రాంతంలోని ఫుట్‌పాత్‌పై ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి ప్యారడైజ్‌ సిగ్నల్‌లో సమీపంలోని ఫుట్‌పాత్‌పై భార్య పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు 3.30గంటల సమయంలో ఆటోలో వచ్చిన నిందితులు కాలే కుమార్తె కరిష్మా( మూడున్నరేళ్లు)ను ఎత్తుకుని ఆటోలో వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గుర్తించి ఆటోలో పాపను ఎత్తుకుని వెళ్లిన విషయాన్ని బాధితులకు తెలియజేశాడు. అతడి ద్విచక్రవాహనంపైనే వారు వెళ్లిన ట్యాంక్‌బండ్‌, ఇతర ప్రాంతాల్లో గాలించారు. ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో బాధితుడు మహంకాళి పోలీసులకు 4.15గంటల సమయంలో వచ్చి తన కుమార్తె కిడ్నాప్‌ అయినట్టు ఫిర్యాదు చేశాడు.

మహంకాళి పోలీసులు అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా అదే సమయంలో సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న శివకుమార్(7నెలలు)ను ఆటోలో వచ్చిన ఇద్దరు కిడ్నాప్‌ చేశారని ఫిర్యాదుతో సుల్తాన్‌బజార్‌ పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదైంది. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డులను కూడా పోలీసులు పరిశీలించి ఆటోను గుర్తించారు. రెండు గంటల్లోనే ప్యారడైజ్‌ వద్ద పాపను కిడ్నాప్‌ చేసిన నిందితులు సుల్తాన్‌బజార్‌ ప్రాంతంలో మరో బాలుడిని కిడ్నాప్‌ చేసినట్లుగా గుర్తించారు. ఆటోడ్రైవర్‌ షేక్‌ ఇమ్రాన్‌ ఇంటివద్ద కిడ్నాప్‌ అయిన ఇద్దరు చిన్నారులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇమ్రాన్‌, పర్వీన్‌ను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని