Andhra Pradesh: విశాఖలో 2లక్షల కేజీల గంజాయి దహనం

విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని దహనం చేశారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో

Updated : 12 Feb 2022 17:23 IST

విశాఖ: విశాఖ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని దహనం చేశారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో తరలిస్తుండగా పట్టుబడిన 2లక్షల కిలోల గంజాయిని తగలబెట్టారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో సీజ్‌ చేసిన రూ.కోట్ల విలువ చేసే ఈ పొడి గంజాయిని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా దహనం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గంజాయి సరఫరా నియంత్రణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ గంజాయిని ధ్వంసం చేయలేదన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుకి మావోయిస్టుల  ప్రాబల్యం ఉందన్నారు. గిరిజనుల్లో మార్పు వచ్చిందని గంజాయి సాగు, రవాణా వల్ల జరుగుతున్న నష్టాన్ని గుర్తించి దీనికి దూరంగా ఉంటున్నారన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని  డీజీపీ వెల్లడించారు.

ప్రత్యామ్నాయ పంటలపై గిరిజనులకు అవగాహన కల్పించి ఆయా పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కువగా ఉంటుందని  విశాఖ మీదుగా రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. దీన్ని అరికట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంజాయి సాగు విడిచిపెట్టిన గిరిజనులకు నగదు బహుమతి అందజేశారు. 

మంత్రి వ్యాఖ్యలపై విచారణ సా..గుతోంది!

విశాఖ శారదాపీఠం వద్ద పోలీసులను మంత్రి సీదిరి అప్పలరాజు అసభ్య పదజాలంతో దూషించిన ఘటనపై డీజీపీ ముక్తసరిగా స్పందించారు. మంత్రి వ్యవహారంపై విలేకర్లు ప్రశ్నించగా.. పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతోందని బదులిచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని