Crime News: తమ్ముడిని హత్య చేశారనే అనుమానం.. కాల్వలో పడేసి ఊపిరాడకుండా చంపేశారు!

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ నగల దుకాణాలో పనిచేసే ఉద్యోగి రామాంజనేయులు హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 25 Apr 2022 02:21 IST

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ నగల దుకాణాలో పనిచేసే ఉద్యోగి రామాంజనేయులు హత్య కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయ్‌ భాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలగడ్డకు చెందిన రామాంజనేయులు, గిరిజవోలుకు చెందిన జంగం చంటి స్నేహితులు. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి జంగం చంటి కనిపించకుండా పోయాడు. గతంలో బంగారం దొంగతనం కేసులో చంటి జైలుకు వెళ్తే బెయిల్‌ ఇప్పించడంలో రామాంజనేయులు సహకరించాడని పోలీసులు తెలిపారు. 

అందుకే చంటి ఎక్కడున్నాడో రామాంజనేయులకు తెలుసని.. చంటి సోదరులు జంగం బాజీ, జంగం రామయ్య మరో ముగ్గురు వ్యక్తులు గత శుక్రవారం నగల దుకాణం వద్దకు వెళ్లి రామాంజనేయులను బయటకు పిలిచి సోదరుడి సమాచారం కోసం ఆటోలో తీసుకెళ్లారు. పట్టణంలో సుమారు గంటన్నరపాటు ఆటోలో తిప్పి సోదరుడి గురించి ఆరా తీశారు. అయితే రామాంజనేయులు ఎంతకీ చెప్పకపోవడంతో అతడిని ఎడ్లపాడు కెనాల్‌ వద్దకు తీసుకెళ్లారు. చంటిని రాయపాటి వెంకన్న, మరో వ్యక్తి విజయవాడలో హత్యచేశారని రామాంజనేయులు చెప్పారు. దీంతో తమ సోదరుడి మృతిలో రామాంజనేయుల పాత్ర కూడా ఉందంటూ అతడిని కాల్వలో పడేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోతంలో కట్టేసి ఆటోలో తీసుకెళ్లి తుమ్మలపాలెం కల్వర్టు వద్ద పడేశారు. నిందితులు జంగం బాజీ, రామయ్యపై కేసు నమోదుచేసి అరెస్ట్‌ చేశామని.. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని