Drugs: పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. ఇద్దరు డ్రగ్స్‌ స్మగ్లర్ల అరెస్టు

నూతన సంవత్సర వేడుకల రోజున పోలీసులు జరిపిప ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు డ్రగ్స్‌ కేసుతో సంబంధమున్న ఇద్దరు పాత నేరస్తులు పట్టుబడ్డారు. వారి నుంచి 3 గ్రాముల కొకైన్‌, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 02 Jan 2023 16:04 IST

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు (police) నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్‌ (Drugs) కేసులో పాత నేరస్థులు పట్టుబడ్డారు. రాంగోపాల్ పేట్‌లో నవంబర్ 3న నమోదైన కేసులో మోహిత్ అగర్వాల్, మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి నిందితులు. కేసు నమోదైనప్పటి నుంచి వాళ్లిద్దరూ పరారీలో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్ పోలీసులతో కలిసి రాంగోపాల్ పేట్ పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 గ్రాముల కొకైన్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్లు నిర్వహిస్తున్న మోహిత్ అగర్వాల్.. ముంబయి, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తుంటాడు. హైదరాబాద్‌లోని పబ్‌లలో సైతం ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. పార్టీలు నిర్వహిస్తూ కొకైన్‌కు బానిసగా మారిన మోహిత్ పలువురికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌లో కీలక నిందితుడు ఎడ్విన్‌తో కూడా మోహిత్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మరో నిందితుడు హైదరాబాద్‌లో కేఎంసీ ప్రైవేట్‌ లిమిటెడ్ సంస్థను నడుపుతున్న మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తరచూ పబ్బుల్లో స్నేహితులకు పార్టీల ఇస్తున్న కిషోర్.. డ్రగ్స్‌కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ సేవించేందుకు తరచూ గోవా వెళ్లి వస్తుంటాడని చెప్పారు. ఎడ్విన్‌తో కూడా పరిచయాలు ఉన్నాయన్నారు. అతనితోపాటు బెంగళూరులోని మరో వ్యక్తితో కిషోర్‌కు పరిచయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను ఆ వ్యక్తి బస్సుల్లో పంపుతుండగా.. అతనికి కృష్ణ కిషోర్‌ గూగూల్ పే ద్వారా డబ్బులను పంపి డ్రగ్స్‌  తీసుకుంటున్నాడని పోలీసులు వివరించారు. నిన్న బంజారాహిల్స్ రోడ్ నం.3 లోని అతని నివాసంలో కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసి.. 2గ్రాములు కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా నిందితుడు మోహిత్ అగర్వాల్ భార్య సినీ నటి నేహదేశ్ పాండే. అమె పలు తెలుగు సినిమాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని