Madhya Pradesh: సంతానం కలగాలని దారుణం.. ఇద్దరు మహిళల బలి!

పిల్లలు కలగాలని సంతానంలేని ఓ జంట భూతవైద్యుడి ఆశ్రయించిన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు......

Published : 25 Oct 2021 01:39 IST

గ్వాలియర్‌: ఆధునిక సాంకేతికతలో దేశం పరుగులు పెడుతున్నా.. కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. మంత్రాల నెపంతో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. పిల్లలు కలగాలని సంతానంలేని ఓ జంట భూతవైద్యుడి ఆశ్రయించిన ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గ్వాలియర్‌కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. దీంతో మిత్రుడు నీరజ్‌ పర్మార్‌ ఆ దంపతులను భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న గిర్వార్‌ యాదవ్‌ వద్దకు తీసుకెళ్లాడు. అయితే ఓ వ్యక్తిని బలిస్తే సంతానం కలుగుతుందని ఆ మాంత్రికుడు దంపతులకు సెలవిచ్చాడు. దీంతో బలిచ్చేందుకు వ్యక్తి కోసం వేట ప్రారంభించిన వారి మిత్రుడు నీరజ్‌ పర్మార్‌.. ఈనెల 13న ఓ సెక్స్‌ వర్కర్‌ను తీసుకువచ్చాడు. అక్కడే ఆమెను హత్య చేసి ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించాడు. అయితే కొద్దిదూరం వెళ్లగా.. బైక్‌ జారి కిందపడిపోయింది. దీంతో భయాందోళన చెందిన నీరజ్‌ మృతదేహాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంత జరిగినప్పటికీ బలి విషయంలో వారు వెనక్కి తగ్గలేదు. వారంరోజుల వ్యవధిలో అక్టోబర్‌ 20న మరో సెక్స్‌ వర్కర్‌ను ట్రాప్‌చేసి ఆమెను హత్యచేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి భూతవైద్యుని ఎదుట బలిచ్చారు. మొదట హత్యకు గురైన మహిళ మృతదేహం ఈ 21న లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు నీరజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలను వెల్లడించాడు. దీంతో భూతవైద్యుడు సహా ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని