Gangster Murder: కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ హత్య.. లాయర్ దుస్తుల్లో వచ్చి కాల్పులు
Gangster Muder: కోర్టు ప్రాంగణంలోనే ఓ గ్యాంగ్‌స్టర్‌ను దుండగులు కాల్చివేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగిందీ ఘటన.
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ(Lucknow)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగానే గ్యాంగ్‌స్టర్(gangster) సంజీవ్ జీవా దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు న్యాయవాదుల దుస్తుల్లో వచ్చి అతడిపై కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. లఖ్‌నవూ సివిల్ కోర్టు(Lucknow civil court) గది బయట జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
పశ్చిమ యూపీలో క్రిమినల్ గ్యాంగ్‌ను నడుపుతోన్న గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా నేలపై పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు, ఈ ఘటనలో పోలీస్ కానిస్టేబుల్‌తో పాటు ఓ బాలిక గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో ఓ క్రిమినల్ కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడిపై కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడినుంచి తప్పించుకొని పారిపోయారు. ఈ ఘటనతో కోర్టు ఆవరణలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
పశ్చిమ యూపీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన సంజీవ్ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. భాజపా ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ పోలీస్ కస్టడీలో హత్యకు గురైన రెండు నెలల్లోనే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దోషుల్ని వదలం.. డిప్యూటీ సీఎం
ఈ ఘటనపై తనకు సమాచారం లేదని యూపీ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య అన్నారు. కానీ, ఈ ఇత్యకు పాల్పడింది ఎవరైనా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. దోషుల్ని వదిలి పెట్టబోమన్నారు.
ఇది ప్రజాస్వామ్యమేనా?: అఖిలేశ్
లఖ్‌నవూ సివిల్ కోర్టు ఆవరణలో కాల్పుల ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితిని లేవనెత్తారు. ఇది ప్రజాస్వామ్యమేనా? ఎవరిని చంపుతున్నారనే విషయం కన్నా భద్రత అధికంగా ఉన్న చోటే హత్యలు జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.