Safer in Jail: పెరోల్‌ వద్దు.. జైలే ముద్దు!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖైదీలు మాత్రం తమకు పెరోల్‌ వద్దని వేడుకుంటున్నారు. బయట కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. జైలులోనే సురక్షితంగా ఉన్నామని అధికారులను అభ్యర్థించారు.

Published : 31 May 2021 01:07 IST

కరోనా వేళ జైలే సురక్షితమంటున్న యూపీ ఖైదీలు

లఖ్‌నవూ: వివిధ కేసుల్లో జైలుకు వెళ్లిన విచారణ ఖైదీలు, శిక్షపడిన వారు బెయిల్‌పై బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖైదీలు మాత్రం తమకు పెరోల్‌ వద్దని వేడుకుంటున్నారు. బయట కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. జైలులోనే సురక్షితంగా ఉన్నామని అధికారులను అభ్యర్థించారు.

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్‌పై తాత్కాలికంగా విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలను న్యాయస్థానాలు పరిశీలిస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది బెయిల్‌ పొందలేని ఖైదీలు పెరోల్‌పై విడుదలవుతున్నారు. కానీ, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కొందరు ఖైదీలు మాత్రం తమకు పెరోల్‌ వద్దని అధికారులను వేడుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 21 మంది ఖైదీలు తమ పెరోల్‌ వద్దని అభ్యర్థించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ జైళ్లశాఖ డీజీ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఘజియాబాద్‌, గౌతమ్‌బుద్ధ నగర్‌, మీరట్‌, మహారాజ్‌గంజ్‌, గోరఖ్‌పూర్‌, లఖ్‌నవూ జైళ్లనుంచి 21 మంది ఖైదీలు తాము జైళ్లలోనే సురక్షితంగా ఉన్నామని.. పెరోల్‌పై విడుదల చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు.

మూడు నెలలపాటు పెరోల్‌పై విడుదల అయితే .. అదే కాలాన్ని శిక్ష పడిన కాలానికి అదనంగా కలుపడం ఒక కారణమైతే.. పెరోల్‌పై బయటకు వెళితే వారికి సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లభించకపోవచ్చని ఖైదీలు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు, సమయానికి ఆహారం లభించడంతో జైళ్లలోనే సురక్షితంగా భావిస్తున్నట్లు ఖైదీలు తెలిపినట్లు జైళ్లశాఖ అధికారులు వెల్లడించారు. వీటికి అధికారులు ఎలా స్పందించారు అన్న ప్రశ్నకు.. ఖైదీలు లిఖితపూర్వకంగా ఇచ్చిన అభ్యర్థనను తప్పకుండా గౌరవిస్తామని.. వారు కోరినట్లే ఇక్కడే ఉంచుతామని యూపీ జైళ్లశాఖ డీజీ పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 9వేల ఖైదీలకు బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు బెయిల్‌ పొందని 2200 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీరిని విడుదల చేశామని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణతో చాలా జైళ్లలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా అక్కడ భౌతిక దూరం పాటించడం కుదరకపోవడం సమస్యగా మారింది. ఇలాంటి సమయంలో ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసే చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి.. విచారణ, శిక్ష అనుభవిస్తోన్న ఖైదీలకు మధ్యంతర బెయిల్‌ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని