UP: మద్యం మాఫియా చేతిలో జర్నలిస్ట్‌ బలి!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఓ టీవీ జర్నలిస్ట్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారికి లేఖ రాసిన రెండు రోజులకే....

Published : 15 Jun 2021 01:13 IST

వేడెక్కిన రాజకీయాలు

ప్రతాప్‌గఢ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఓ టీవీ జర్నలిస్ట్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారికి లేఖ రాసిన రెండు రోజులకే ఆయన మరణించడం పలు అనుమానాలకు దారితీసింది. సులభ్‌ శ్రీవాత్సవ ప్రతాప్‌గఢ్‌లో టీవీ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అక్కడి మద్యం మాఫియాపై ఆయన పలు కథనాలు అందించారు. దీంతో మద్యం మాఫియా తనపై కక్షగట్టిందని, తనకు ప్రాణహాని ఉందని ఆయన ఏడీజీకి లేఖ రాశారు. కాగా శ్రీవాత్సవ మృతిని పోలీసులు రోడ్డు ప్రమాదంగా పేర్కొంటున్నారు. ఆదివారం రాత్రి 10 నుంచి 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలిపారు. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండి, జారడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు.

తూర్పు ప్రతాప్‌గఢ్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ.. ‘సులభ్‌ శ్రీవాత్సవ ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన వార్తను కవర్‌ చేసుకొని వస్తూ ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం జారి  రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కొందరు శ్రీవాత్సవను ఆసుపత్రికి తరలించారు. ఆయన కుటుంబానికి కూడా సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఘటనా ప్రాంతానికి పోలీసులు చేరుకొని అది బైక్‌ జారడం వల్ల జరిగిన ప్రమాదమేనని నిర్ధరించారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాం’ అని వెల్లడించారు.

జర్నలిస్ట్‌ అనుమానాస్పద మృతి ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ దుమారం రేపింది. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) జనరల్‌ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలోని అలీగఢ్‌ నుంచి ప్రతాప్‌గఢ్‌ వరకు మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. నిజాన్ని నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులకు రక్షణ లేదు. ప్రాణహాని ఉందని చెప్పినా ప్రభుత్వం నిద్ర మత్తు వీడలేదు. గూండా రాజ్యాన్ని పెంచి పోషించే యూపీ ప్రభుత్వం.. జర్నలిస్ట్‌ సులభ్‌ శ్రీవాత్సవ కుటుంబానికి ఏమని సమాధానమిస్తుంది?’ అని ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. మద్యం మాఫియా నుంచి ప్రాణహాని ఉందని జర్నలిస్ట్‌ చెప్పినా ఆయనకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటు అని మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని