Crime News: సిమ్‌కార్డుల దందాలో యూపీ లింకులు..!

దొంగచాటుగా సిమ్‌కార్డులు విక్రయించడం ద్వారా సైబర్‌ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ)కు కీలక సమాచారం లభ్యమైంది.

Published : 07 Jul 2024 02:43 IST

ముజఫర్‌నగర్‌ ఖతౌలి నుంచి హైదరాబాద్‌కు సరఫరా..
‘నీర్‌ ఎంటర్‌ప్రైజ్‌’ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీపై ఆధారాలు

ఈనాడు, హైదరాబాద్‌: దొంగచాటుగా సిమ్‌కార్డులు విక్రయించడం ద్వారా సైబర్‌ టెర్రరిజానికి పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ)కు కీలక సమాచారం లభ్యమైంది. దర్యాప్తు క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి నుంచి హైదరాబాద్‌కు సిమ్‌కార్డులు అక్రమంగా సరఫరా అయినట్లు తేలింది. ఇప్పటికే సీఎస్‌బీకి చిక్కిన నిందితులను విచారించగా ఈ దందాకు సంబంధించి మరిన్ని అంశాలు బయటపడ్డాయి. తాము రెండు టెలిగ్రామ్‌ ఛానళ్ల ఐడీలతోపాటు మరో వాట్సప్‌ నంబరుతో సంప్రదింపులు జరిపినట్లు నిందితులు అంగీకరించారు. తమకు సిమ్‌కార్డులు పంపిన వ్యక్తి సెల్‌ఫోన్‌ ద్వారా మాత్రమే సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ములో తమ కమీషన్‌ పోను మిగిలిన డబ్బును ఖతౌలిలో ‘నీర్‌ ఎంటర్‌ప్రైజ్‌’ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఖాతా గురించి ఆరా తీయడంలో సీఎస్‌బీ నిమగ్నమైంది. నకిలీ ధ్రువీకరణపత్రాలు సమర్పించడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల పేరిట ఈ సిమ్‌కార్డులు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల వారికి సిమ్‌కార్డులు విక్రయించడంతోపాటు విదేశాలకూ పంపుతున్నట్లు వెల్లడైంది. దుబాయ్, కంబోడియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది.

సీఎస్‌బీ డెకాయ్‌ ఆపరేషన్‌కు చిక్కిన ముఠా

సామాజిక మాధ్యమాల్లో సిమ్‌కార్డుల అక్రమ దందా నడుస్తోందనే సమాచారంతో సీఎస్‌బీ డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. 

  • ముందుగా ‘ఇండియన్‌ బ్యాంక్స్‌ అండ్‌ సిమ్‌కార్డ్స్‌ సేల్‌ ట్రస్టెడ్‌’ పేరిట ఉన్న టెలిగ్రామ్‌ ఛానల్‌లో సీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు మారుపేరుతో సభ్యుడిగా చేరారు. 
  • చైనీస్‌(మాండరిన్‌) భాషతో డిస్‌ప్లే నేమ్‌ గల గుర్తుతెలియని వ్యక్తి ఆయనకు చాటింగ్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తనకు బల్క్‌గా సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు కావాలని ఇన్‌స్పెక్టర్‌ అడిగారు. 
  • అనంతరం టిల్లు అలియాస్‌ విజయ్‌భాస్కర్‌ అనే వ్యక్తి లైన్‌లోకి వచ్చి.. తాను దుబాయ్‌లో ఉంటానని చైనీస్‌ కంపెనీల తరఫున పని చేస్తానని వెల్లడించాడు. తొలుత సిమ్‌కార్డులు సరఫరా చేస్తానని, తర్వాత బ్యాంకు ఖాతాలు సమకూరుస్తానని పేర్కొన్నాడు.
  • తనకు 1000 సిమ్‌కార్డులు కావాలని ఇన్‌స్పెక్టర్‌ కోరారు. ఒక్కో దానికి రూ.1500 అవుతుందని చెప్పిన టిల్లు అనంతరం రూ.1300కు ఇస్తానన్నాడు. 
  • అయితే ప్రస్తుతం 113 సిమ్‌కార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, కూకట్‌పల్లిలో తన సోదరుడు నవీన్‌తోపాటు షేక్‌సుభానీని వెళ్లి కలవాలని టిల్లు సూచించాడు. 
  • దీంతో పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద 61 సిమ్‌కార్డులు దొరికాయి. 
  • మైఖేల్‌ అలియాస్‌ మరడాన ప్రేమ్‌కుమార్‌ తమకు సిమ్‌కార్డులు ఇచ్చాడని, వాటిని అమ్మితే 20శాతం కమీషన్‌ దక్కుతుందని వారు చెప్పారు. ఈ సమాచారంతో పోలీసు బృందం బాలానగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద మైఖేల్‌ను పట్టుకుంది. అతడి వద్ద మరో 52 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకొంది. 
  • వీరి నుంచి లభ్యమైన సమాచారంతో తాజాగా అనిల్‌ అనే మరో నిందితుడిని అరెస్టు చేశారు.
  • ఇలా కూపీ లాగుతూపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ లింకులు బహిర్గతమయ్యాయి. అక్కడి నేరగాళ్లతో పాటు దుబాయ్‌లో ఉంటున్న టిల్లును కూడా పట్టుకుంటే అక్రమ సిమ్‌కార్డుల దందాకు సంబంధించి భారీ రాకెట్‌ బహిర్గతమవుతుందని సీఎస్‌బీ భావిస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని