చంపేసి.. కొవిడ్ మరణం కింద తోసేసి..!

డబ్బు కోసం ఓ యువకుడిని అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి కిడ్నాప్‌ చేసి, హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు

Published : 29 Jun 2021 01:38 IST

ఆగ్రా: డబ్బు కోసం ఓ యువకుడిని అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి కిడ్నాప్‌ చేసి, హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ హత్యను కొవిడ్‌ మరణంగా చిత్రీకరించారు. పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని దహనం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో వారం కింద చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆగ్రాకు చెందిన ఓ శీతల గిడ్డంగి యజయాని కుమారుడు సచిన్‌ చౌహాన్‌(23)ను అతడి స్నేహితుడు, మరో నలుగురు కలిసి హత్య చేశారు. ఈ నెల 23న ఓ పాడుబడిన వాటర్‌ ప్లాంట్‌ వద్దకు సచిన్‌ను తీసుకెళ్లి ఉద్దేశపూర్వకంగా మద్యం తాగించారు. అనంతరం ఆ అయిదుగురూ కలిసి ప్లాస్టిక్‌ కవరుతో అతడి నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ హత్యను కొవిడ్‌ మరణంగా చిత్రీకరించాలనుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని దహనం చేశారు.

అయితే కుమారుడు కనిపించకపోవడంతో సచిన్‌ తల్లి అతడి మొబైల్‌కు ఫోన్‌ చేసింది. కుమారుడు కాకుండా వేరొక వ్యక్తి ఫోన్‌ ఎత్తి.. సచిన్‌ మాట్లాడే పరిస్థితిలో లేడంటూ సమాధానమిచ్చాడు. దీంతో సచిన్‌ తల్లిదండ్రుల్లో అనుమానం మొదలైంది. వెంటనే తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య చేసిన అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా.. రూ.2 కోట్ల కోసం సచిన్‌ను హత్య చేసినట్లు వారు అంగీకరించారు. 25 రోజుల క్రితమే హత్యకు పథకం పన్నినట్లు చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని