UP: ‘నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తారు’.. భయం మధ్యే గ్యాంగ్‌స్టర్‌ యూపీకి తరలింపు

బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీక్‌ అహ్మద్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో హాజరుపరిచేందుకు గాను ఆయన్ను ప్రత్యేక వాహనంలో గుజరాత్‌ నుంచి యూపీకి తరలిస్తున్నారు.

Published : 26 Mar 2023 22:35 IST

అహ్మదాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు తనను బూటకపు ఎన్‌కౌంటరులో చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న నిందితుడు అతీక్‌ను ఓ కేసు విచారణలో భాగంగా కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు సిద్ధమయ్యారు. తొలుత జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించిన అతడ్ని చివరకు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ చేస్తారన్న అతడి భయాల మధ్యే యూపీ పోలీసులు అతీక్‌ను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లారు. గుజరాత్‌ నుంచి ప్రయాగరాజ్‌కు సుమారు 30 గంటల పాటు వీరి ప్రయాణం సాగనుంది.

2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ ప్రధాన నిందితుడు. 2019 నుంచి సబర్మతి జైల్లో ఉంటున్నాడు. ఇతడిపై సుమారు వందకు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. అయితే, ఎమ్మెల్యే రాజుపాల్‌ కేసులో ముఖ్యసాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ 2005లో కిడ్నాప్‌కు గురై విడుదలయ్యాడు. ఈ కేసు విచారణ చివరి రోజు (ఫిబ్రవరి 24, 2023)నే ఉమేశ్‌పాల్‌ హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఇద్దరు అంగరక్షకులను పట్టపగలే కాల్చి చంపడం యూపీలో ఇటీవల సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఉమేశ్‌పాల్‌ను హత్య చేసినట్లు భావిస్తోన్న ఓ వ్యక్తి మార్చి 14న జరిగిన పోలీస్‌ ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. ఈ కేసులో అతీక్‌ అహ్మద్‌పైనా కేసు నమోదయ్యింది.

మరోవైపు, గతంలో కిడ్నాప్‌ కేసుకు సంబంధించి మార్చి 28న యూపీ ప్రయాగ్‌రాజ్‌ కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో అతీక్‌ అహ్మద్‌ను కోర్టు ముందు హాజరుపరిచేందుకు యూపీ పోలీసులు సబర్మతి సెంట్రల్‌ జైలుకు ఆదివారం ఉదయం చేరుకున్నారు. అయితే, యూపీ పోలీసులు చంపేస్తారేమోననే భయంతో ఉన్న అతడు.. జైలు నుంచి బయటకు వచ్చేందుకు తొలుత నిరాకరించాడు. సబర్మతి జైలు అధికారులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం యూపీ పోలీసులు అతన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారమే అందరి నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉందని ప్రయాగ్‌రాజ్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ రామిత్‌ శర్మ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని