Updated : 04 May 2022 14:39 IST

Crime News: హైదరాబాద్‌ శివారులో జంట హత్యలు.. భర్తే స్క్రూడ్రైవర్‌తో చంపేశాడు!

అబ్దుల్లాపూర్‌మెట్‌: హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. వివాహేతర సంబంధంతోనే యశ్వంత్‌, జ్యోతి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాంకేతిక ఆధారాల సాయంతో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆయనే ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేల్చారు. వివాహేతర సంబంధంతోనే ఈ హత్యలు చేసినట్లు మృతురాలి భర్త ఒప్పుకొన్నట్లు తెలిసింది. 

30 కి.మీ వెంబడించి..

గతకొంతకాలంగా యశ్వంత్‌, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు భర్త గుర్తించాడు. ఓసారి ఇంట్లోనే వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుంచి యశ్వంత్‌, జ్యోతి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండటాన్ని భర్త గుర్తించి వారిని వెంబడించాడు. అక్కడి నుంచి సుమారు 30 కి.మీ దూరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడ సమీపంలో చెట్లపొదల్లోకి వారు వెళ్లడాన్ని గమనించాడు.

మద్యం తాగి.. ఆవేశాన్ని అణచుకోలేక..

యశ్వంత్‌, జ్యోతి ఏకాంతంగా గడుపుతుండటాన్ని భర్త నేరుగా చూశాడు. మార్గంమధ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్లిన మద్యాన్ని అక్కడే తాగాడు. అనంతరం ఆవేశాన్ని అణచుకోలేక పక్కనే ఉన్న రాయి తీసుకెళ్లి జ్యోతి తలపై మోదాడు దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో యశ్వంత్‌ గుండెపై ఒక్కసారిగా పొడిచాడు. దీంతో యశ్వంత్‌ కుప్పకూలి అపస్మారకస్థితికి వెళ్లాడు. అప్పటికే కసితో రగిలిపోతున్న జ్యోతి భర్త.. యశ్వంత్‌ మర్మాంగంపైనా దాడి చేసి ఛిద్రం చేశాడు. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

మరోవైపు ఈ హత్యలను తానొక్కడినే చేసినట్లు జ్యోతి భర్త చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం జ్యోతి భర్తతోపాటు ఆమె సమీప బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒక్కడే ఈ హత్యలు చేశాడా? ఇంకెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.  

కేసు నేపథ్యమిదీ..

అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చిన ఒక యువకుడు, మహిళను దుండగులు అతి దారుణంగా హతమార్చారు. మూడు రోజుల తరువాత మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఎన్‌హెచ్‌ 65 పక్కన రెండు మృతదేహాలున్నట్టు స్థానికులిచ్చిన సమాచారంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అక్కడికి వెళ్లారు. నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. సమీపంలో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనం (టీఎస్‌10ఎఫ్‌బి 2384) ఆధారంగా వివరాలు సేకరించారు. వాహన యజమాని వారాసిగూడకు చెందిన యడ్ల అనిరుధ్‌ను రప్పించారు. ఆయన వచ్చి.. మృతదేహం తన సోదరుడు యశ్వంత్‌ (22)దిగా గుర్తుపట్టారు. అక్కడ దొరికిన చేతిసంచిలోని రసీదు ఆధారంగా మృతురాలు వారాసిగూడకు చెందిన జ్యోతి (30) అని గుర్తించారు. 

ఫోన్‌కాల్‌తో బయటకు..

వారాసిగూడకు చెందిన యడ్ల యశ్వంత్‌ క్యాబ్‌ డ్రైవర్‌. అతడి తండ్రి కొబ్బరిబొండాలు విక్రయించేవారు. యశ్వంత్‌ మొదట్లో డ్రైవర్‌గా పనిచేసి.. ఇటీవలే కారు కొని అద్దెకు తిప్పుతున్నాడు. అదే ప్రాంతంలో జ్యోతి కుటుంబం ఉండేది. ఆమె భర్త స్టీలు సామాన్లు విక్రయించేవాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఆదివారం సాయంత్రం యశ్వంత్‌కు ఫోన్‌కాల్‌ రావటంతో సోదరుడి ద్విచక్ర వాహనం తీసుకుని 7 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. తర్వాత జ్యోతిని వెంటబెట్టుకుని.. సంఘటన స్థలానికి వచ్చాడు. హత్యలు జరిగిన ప్రాంతం ముళ్లచెట్లు, పొదలతో నిండి ఉంటుంది. కల్లుగీత కోసం వెళ్లిన కార్మికుడొకరు తాటిచెట్టు ఎక్కినప్పుడు దుర్వాసన రావటంతో మృతదేహాలను గుర్తించాడు. గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పటంతో పోలీసులకు సమాచారం చేరింది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని