ఉజ్బెకిస్థాన్‌ చిన్నారుల మరణాలు.. ముగ్గురి అరెస్టు చేసిన యూపీ పోలీసులు!

కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CSDSCO) గురువారం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan)లో దగ్గు మందు (Cough Syrup) కారణంగా చిన్నారులు మృతి చెందిన ఘటనలో ఐదుగురిపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Published : 04 Mar 2023 00:40 IST

నోయిడా: ఉజ్బెకిస్థాన్‌ (Uzbekistan)లో దగ్గు మందు (Cough Syrup) కారణంగా చిన్నారులు మృతి చెందిన ఘటనలో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు (Uttar Pradesh Police) ముగ్గురిని అరెస్టు చేశారు. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CSDSCO) గురువారం ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం ఐదుగురిపై యూపీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరిలో ముగ్గురు సంస్థ ఉద్యోగులు కాగా, ఇద్దరు కంపెనీ డైరెక్టర్లు. వీరిలో ముగ్గురు ఉద్యోగులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు, ఇద్దరు డైరెక్టర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో కంపెనీ వ్యవహారాల విభాగం అధిపతి తుహిన్‌ భట్టాచార్య, తయారీ విభాగం కెమిస్ట్ అతుల్ రావత్‌, అనలిటికల్‌ కెమిస్ట్‌ మూల్‌ సింగ్‌ ఉన్నారు. 

నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మరియన్‌ బయోటెక్‌ (Marion Biotech) అనే సంస్థ తయారు చేసిన డాక్‌-1 (Dok-1) అనే సిరప్‌ తాగి ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది పిల్లలు మృతి చెందారు. వీరి మరణాలకు మరియన్‌ బయోటెక్‌ తయారు చేసిన సిరప్‌ కారణమని ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యశాఖ ఆరోపించింది. దీనిపై స్పందించిన డబ్ల్యూహెచ్‌వో (WHO), ప్రయోగశాల నివేదికల ప్రకారం మరియన్‌ బయోటెక్ తయారు చేసిన దగ్గు మందులు నాసిరకమైనవిగా తేల్చింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు కూడా మరియన్‌ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులు నమూనాలను సేకరించి వాటిని పరీక్షించారు. అందులో 22 రకాల మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనట్లు నివేదికలో పేర్కొన్నారు. దాని ఆధారంగా యూపీ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. గతేడాది హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా పనిచేసే  మైడెన్‌ ఫార్మా కంపెనీ ఉత్పత్తిచేసిన సిరప్‌లు వినియోగించి గాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు