Hyderabad: మాజీ సీఐ నాగేశ్వర్‌రావుపై 600 పేజీల ఛార్జ్‌షీట్‌.. కోర్టుకు సమర్పించిన పోలీసులు

అత్యాచారం కేసులో డిస్మిస్‌ అయిన మాజీ సీఐ నాగేశ్వర్‌రావు కేసులో వనస్థలిపురం పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

Published : 12 Oct 2022 12:40 IST

హైదరాబాద్‌: అత్యాచారం కేసులో డిస్మిస్‌ అయిన మాజీ సీఐ నాగేశ్వర్‌రావు కేసులో వనస్థలిపురం పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఎల్బీ నగర్‌ కోర్టుకు సమర్పించిన 600 పేజీల ఈ ఛార్జ్‌షీట్‌లో 75 మంది సాక్షులను చేర్చారు. నాగేశ్వర్ రావు నేరం చేశారనడానికి తగిన ఆధారాలను పొందుపర్చారు. 

ఈ ఏడాది జులై 7న వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నాగేశ్వర్‌రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం చేయడంతో పాటు.. అపహరించారని బాధిత మహిళ పోలీసులకు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జులై 11న నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత అదే నెల 18న కస్టడీలోకి తీసుకొని ఐదు రోజుల పాటు ప్రశ్నించారు. నాగేశ్వర్‌రావు అత్యాచారం చేశారనడానికి తగిన ఆధారాలు సేకరించారు. మహిళ లోదుస్తుల్లో నమూనాలు సేకరించి నాగేశ్వర్‌రావు డీఎన్ఏతో సరిపోల్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఈ రెండూ సరిపోలాయి. సీసీ కెమెరా దృశ్యాలను సైతం పరిశీలించారు. 

నాగేశ్వర్‌రావు మొబైల్‌ను విశ్లేషించి అత్యాచారం జరిగిన సమయంలో ఆయన మహిళ ఇంట్లోనే ఉన్నట్లు తేల్చారు. మహిళ నివాసముండే ఇంటి వాచ్‌మెన్‌తో పాటు చుట్టుపక్కల వాళ్ల సాక్ష్యాలను నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ కేసు విచారణ ఎల్బీ నగర్ కోర్టులో కొనసాగుతోంది. నాగేశ్వర్‌రావు హైకోర్టు నుంచి బెయిల్ పొందడంతో చర్లపల్లి జైలు నుంచి బయటికి వచ్చాడు. అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన్ను ఇటీవలే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విధుల నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని