
Viral Video: కత్తులతో బెదిరించి చోరీ.. ఛేజ్ చేసి పట్టుకున్న వేలూరు ఎస్పీ!
వెల్లూరు: చోరీ చేసి పారిపోతున్న దొంగలను జిల్లా ఎస్పీనే స్వయంగా ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ‘సింగం’ సినిమాను తలపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పల్లికొండకు చెందిన సతీశ్ వెల్లూరు గ్రీన్ సర్కిల్ వద్ద టాటూ వ్యాపారం చేస్తుంటాడు. సాళవన్ ప్రాంతానికి చెందిన కిషోర్, అతడి ఇద్దరి స్నేహితులు కత్తులతో బెదిరించి సతీశ్ వద్ద ఉన్న సొమ్మును కాజేశారు. అనంతరం బైక్పై పరారయ్యారు. అదే సమయంలో అటుగా వాహనంలో వెళ్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ కంట పడ్డారు.
నిందితులను చూసిన ఎస్పీ వారి వాహనాన్ని అడ్డగించాలని డ్రైవర్ను ఆదేశించాడు. అయితే పోలీసు వాహనాన్ని చూసిన నిందితులు వేగంగా వెళ్లే క్రమంలో అదుపు తప్పి బోల్తాపడ్డారు. ఒకడు బైక్ మీద ఉడాయించగా.. ఇద్దరు నిందితులు పరుగందుకున్నారు. ఎస్పీనే స్వయంగా వెంబడించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 1,200 నగదు, సెల్ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వెల్లూరు నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడిని ఘటన జరిగిన గంటలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని ప్రజలు అభినందించారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం.
Advertisement