Delhi Rape case: ఆ దోషుల్ని ఉరితీయాల్సిందే: వీహెచ్‌పీ డిమాండ్‌

దేశరాజధాని నగరంలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాల్సిందేనని విశ్వహిందూ పరిషత్‌ ......

Updated : 05 Aug 2021 03:31 IST

దిల్లీ దేశరాజధాని నగరంలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాల్సిందేనని విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) డిమాండ్‌ చేసింది. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు బదిలీ చేసి విచారణను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ హత్యాచార ఘటనపై యావత్‌ భారతదేశం, హిందూ సమాజం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తోందని వీహెచ్‌పీ ట్విటర్‌లో పేర్కొంది. 15 రోజుల్లో ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని, అలాగే, మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ముగించాలని కోరింది. ఈ కేసులో దోషులకు మరణదండన విధించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేసింది. 

దిల్లీలోని పాత నంగల్‌ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. చిన్నారి తన ఇంటి సమీపంలోని  శ్మశానం వద్ద ఉన్న వాటర్‌ కూలర్‌ నుంచి తాగునీరు తీసుకొచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాటికాపరితో పాటు మరికొందరు బాలికను అత్యాచారం చేసి చంపారని, పోలీసులకు తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాటికాపరి సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, బాలిక మృతిని తీవ్రంగా పరిగణిస్తూ దిల్లీ మహిళా కమిషన్‌ విచారణకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ సహా పూర్తి దర్యాప్తు నివేదికను ఈ నెల 5 లోగా సమర్పించాలని పేర్కొంటూ డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని