
Mirzapur: బిల్డింగ్ పైనుంచి విద్యార్థిని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపల్
మీర్జాపూర్: తోటి విద్యార్థిని కొట్టాడనే కారణంగా ఓ విద్యార్థి పట్ల ప్రిన్సిపల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. అల్లరి చేస్తున్నాడనే కారణంతో.. ప్రిన్సిపల్ సదరు విద్యార్థిని బిల్డింగ్ పైఅంతస్తు నుంచి వేలాడదీశాడు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఆ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తప్పు చేస్తే సర్దిచెప్పడం పోయి విద్యార్థిని ఇలా శిక్షించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌లో జరిగింది.
అహ్రౌరాలోని సద్భావన శిక్షణ్ హైస్కూల్లో మధ్యాహ్నం ఆడుకుంటుండగా ఓ రెండో తరగతి విద్యార్థి తోటి విద్యార్థితో గొడవ పడ్డాడు. ఆ విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ప్రిన్సిపల్ మనోజ్ విశ్వకర్మ.. అతడిని పాఠశాల బిల్డింగ్ మొదటి అంతస్తు నుంచి తలకిందులుగా వేలాడదీశాడు. దీంతో ఆ విద్యార్థి ప్రాణభయంతో కేకలు వేశాడు. పక్కనే ఉన్న ఇతర విద్యార్థులు సైతం భయభ్రాంతులకు గురయ్యారు. పిల్లలు అల్లరి చేస్తే సర్దిచెప్పాల్సిన గురువు.. ఇలా చేయడం గ్రామస్థులకు కూడా కోపం తెప్పించింది. తప్పు చేస్తే ఇలాంటి శిక్ష విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు విద్యార్థి తండ్రి. ఈ విషయం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వరకు చేరింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించగా.. విచారణ జరిపిన పోలీసు అధికారులు ప్రిన్సిపల్ విశ్వకర్మను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.