Andhra news: విజయనగరంలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 6 కిలోల బంగారం స్వాధీనం

విజయనగరంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని గంటస్తంభం వద్ద రవి జ్యూవెలర్స్‌లో ఈనెల 23వ తేదీన 8 కిలోల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడిని

Updated : 26 Feb 2022 16:04 IST

రింగురోడ్డు: విజయనగరంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని గంటస్తంభం వద్ద రవి జ్యువెల్లర్స్‌లో ఈనెల 23వ తేదీన 8 కిలోల బంగారాన్ని చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 6.18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చోరీకి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ దీపికా ఎమ్‌. పాటిల్‌ విలేకరుల సమావేశంలో శనివారం మధ్యాహ్నం వెల్లడించారు. 

‘‘ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కవర్దా ప్రాంతానికి చెందిన నిందితుడు లోకేశ్‌ శ్రీవాస్‌కు విజయనగరం జైల్లో ఉన్న సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విజయనగరం టౌన్‌లో ఉన్న బంగారు ఆభరణాల దుకాణాల గురించి ఆ వ్యక్తి ద్వారా శ్రీవాస్‌ తెలుసుకున్నాడు. గతేడాది అక్టోబరులో జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ ఏడాది జనవరిలో విజయనగరం చేరుకున్నాడు. దొంగతనానికి అనుకూలమైన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. 23వ తేదీన రవి జ్యువెల్లర్స్‌లో బంగారం చోరీతోపాటు అదే రోజు పాండు జ్యూవెలర్స్‌లో నాలుగు తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఈనెల 14న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో రూ.1.40లక్షల నగదు, గత నెలలో పద్మజా క్లినిక్‌లో రూ.50వేలు చోరీ చేశాడు. గత నెల, ఈనెలలో కలిపి నగరంలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల్లో లోకేశ్‌పై 11 కేసులున్నాయి’’ అని ఎస్పీ దీపికా వివరించారు. కేసును ఛేదించడంలో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఎంతో సాయం అందించారని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ అనిల్‌ కుమార్, సీఐలు సీహెచ్‌ శ్రీనివాసరావు, మురళీ తదితరులు పాల్గొన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని