Andhra news: విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్‌ ఘరానా మోసం

విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్‌ ఘరానా మోసానికి పాల్పడ్డారు. జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమ్య..

Updated : 18 Feb 2022 19:06 IST

సాలూరు: విజయనగరం జిల్లాలో వార్డు వాలంటీర్‌ ఘరానా మోసానికి పాల్పడింది. జిల్లాలోని సాలూరులో వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమ్య.. ఆమె తల్లితో కలిసి పొదుపు చేయండి.. వడ్డీతో పొందండి.. అని నమ్మించి వందల మందిని మోసం చేసింది. మురికివాడ ప్రజలు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని పొదుపు పేరుతో వ్యాపారం ప్రారంభించింది. బాధితుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసి పరారైంది.

సాలూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని చిట్లు వీధికి చెందిన మానాపురం రమ్య వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె తల్లి అరుణతో కలిసి గత 15 ఏళ్లుగా పొదుపు వ్యాపారం సాగిస్తోంది. చిట్లు వీధి, సారిక వీధి, కోట వీధి, గుమడాం, పెద్ద మార్కెట్, చినబజారు, వడ్డివీధి.. ఇలా ఒకటీ.. రెండు అని కాకుండా వార్డులో ఇంటింటికీ వెళ్లి  మహిళలకు పొదుపు ఆశ చూపారు. అలా సుమారు 2వేల మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. రోజుకి రూ.10 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తక్కువలో రూ.10 కట్టినవారికి రూ.4వేలు, రూ.200 కట్టిన వారికి రూ.80వేలు ఏడాదికి వడ్డీతో చెల్లిస్తామని చెప్పి నమ్మించారు. గతేడాది డిసెంబరు నెలతో ఏడాది గడువు పూర్తయిన సుమారు 150 మందికి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదు. అడిగితే బ్యాంకులో డబ్బులు పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. 10 రోజుల కిందట పెళ్లి పేరు చెప్పి రమ్య, ఆమె తల్లి అరుణతో కలిసి ఊరు నుంచి వెళ్లారు. తిరిగి రాకపోవడం.. ఫోన్‌ చేస్తే స్పందించకపోవడంతో పొదుపు చేసిన వారందరికీ అనుమానం వచ్చింది. వాలంటీర్‌ బంధువులను అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పక పోవడంతో బాధితులంతా మోసపోయామని గ్రహించి శుక్రవారం సాయంత్రం పట్టణ పోలీసులను ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు